Eden Gardens: ప్రపంచ కప్‌కోసం సిద్ధమవుతున్న ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అగ్నిప్రమాదం.. ఎలా జరిగిందంటే?
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మరమ్మతు పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Eden Gardens Fire Accident
Eden Gardens Fire Accident: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ -2023 (ICC Mans ODI World Cup 2023) కి ఇండియా (India) ఆతిధ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్‌లో మొత్తం పది మైదానాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) కూడా ఉంది. ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని వరల్డ్ కప్ మ్యాచ్‌లకోసం సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నాటికి మరమ్మతు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో రెయింబవళ్లు ఈ మైదానంలో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరమ్మతు పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి డ్రెస్సింగ్ రూంలో మంటలు చెలరేగడంతో వీటిని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లు ఘటన స్థలంకు వచ్చి మంటలు ఆర్పివేశాయి.
డ్రెస్సింగ్ రూమ్‌లోని ఫాల్‌సలీంగ్‌లో ఈ మంటలు వ్యాపించినట్లు తెలిసింది. విద్యుత్ పరికరాల్లో సమస్య కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై అక్కడి నుంచి బయటకొచ్చారు. అయితే, ప్రమాదం జరిగింది క్రికెటర్ల డ్రెసింగ్ రూమ్ వద్దకావటంతో ఎటువంటి సీసీ కెమెరాలు లేవు. క్రికెటర్లు సాధారణంగా తమ సామాగ్రిని భద్రపర్చుకోవటానికి ఈ గదిని వాడుతుంటారు. అయితే, ఈప్రమాదంలో ఆటగాళ్లకు చెందిన కొంత సామాగ్రి దగ్దమైనట్లు తెలిసింది.
అగ్నిమాపక విషయం తెలిసిన వెంటనే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ జాయింట్ సెక్రటరీ దేబ్రత్ దాస్ మైదానానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఆటగాళ్లకోసం ఇక్కడ మరోకొత్త డ్రసింగ్ రూమ్ నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతుంది. మైదానంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికిగల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది. మరో రెండు నెలల్లో మెగా టోర్నీ ప్రారంభంకానున్న నేపథ్యంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవటంతో ఫైర్ సేప్టీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ మ్యాచ్ జరగాలంటే అగ్నిమాపకశాఖ అనుమతులు తప్పనిసరి. అయితే, ఈ ప్రమాదంలో స్వల్ప నష్టంతో బయటపడ్డామని సిబ్బంది వెల్లడించారు.