Glenn Maxwell: మాక్స్‌వెల్ మాడ్ మ్యాక్స్ ఇన్నింగ్స్.. ఇన్ని రికార్డులా!
ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో రికార్డులను తిరగరాశాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.

Glenn Maxwell Full list of records in ODIs
Glenn Maxwell Records: అఫ్గానిస్థాన్ తో మంగళవారం జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాక్స్‌వెల్ మాడ్ మ్యాక్స్ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా అనూహ్యరీతిలో విజయాన్ని అందుకుంది. అసమాన పోరాటంతో మాక్స్‌వెల్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. టీమ్ కష్టాల్లో పడినప్పుడు, గెలుపు దారులు పూర్తిగా మూసుకుపోయినప్పుడు విధ్వంసకర బ్యాటింగ్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ప్రత్యర్థులు సైతం అతడి ఆట తీరుకు సలాం కొట్టారు. ప్రశంసలతో పాటు పలు రికార్డులు కూడా సాధించాడు మాక్స్‌వెల్.
ఛేజింగ్ లో టాపర్
అజేయ డబుల్ సెంచరీతో మరోసారి తానెంత డేంజర్ బ్యాటర్ నో చాటిచెప్పాడు. 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఛేజింగ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ గా రికార్డు లిఖించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ పేరిట ఉండేది. 2021లో దక్షిణాఫ్రికాపై జమాన్ 193 పరుగులు చేశారు. ODI క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ కొట్టిన నాన్ ఓపెనర్ గా కూడా మాక్స్‌వెల్ రికార్డు కెక్కాడు. 2009లో బంగ్లాదేశ్‌పై చార్లెస్ కోవెంట్రీ చేసిన 194 పరుగులను అధిగమించి ఈ రికార్డు అందుకున్నాడు.

Glenn Maxwell
ఇషాన్ తర్వాత మాక్స్
వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో ద్విశతం సాధించిన మూడో ఆటగాడిగా మాక్స్‌వెల్ నిలిచాడు. 2015 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్(215), న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(237) డబుల్ సెంచరీలు బాదారు. వన్డేల్లో రెండవ వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్ గానూ మాక్స్‌వెల్ రికార్డు నమోదు చేశాడు. టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ముందున్నాడు. 2022లో బంగ్లాదేశ్‌పై కేవలం 126 బంతుల్లోనే ఇషాన్ డబుల్ సెంచరీ కొట్టాడు. తాజాగా మాక్స్‌వెల్ 128 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.
వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో మాక్స్‌వెల్ మూడోస్థానానికి చేరాడు. క్రిస్ గేల్ (49), భారత కెప్టెన్ రోహిత్ శర్మ (45) అతడికంటే ముందున్నారు. మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు 33 సిక్సర్లు కొట్టాడు.
Also Read: బాబోయ్ వీరబాదుడు బాదాడు.. వాంఖడే స్టేడియంలో మ్యాక్స్‌వెల్ విశ్వరూపం.. ఈ వీడియో చూడండి

Glenn Maxwell, Pat Cummins
ఏడో వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు కూడా మాక్స్‌వెల్, కెప్టెన్ పాట్ కమిన్స్ సొంతమైంది. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్ కు 202 పరుగులు జోడించారు. అంతకుముందు 2015లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ప్లేయర్లు జోస్ బట్లర్, ఆదిల్ రషీద్ ఏడో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీన్ని తాజాగా మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ అధిగమించారు.