వాయిదా: ఫిబ్రవరి5న తేలనున్న పాండ్యా-రాహుల్‌ల కేసు

హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు మరో రెండు వారాల సమయం పట్టనుంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ఫిబ్రవరి 5న బీసీసీఐ వీరి కేసుపై తుది తీర్పును ప్రకటించనుంది. కచ్చితంగా ఈ జాప్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్, వరల్డ్ కప్ 2019లో వారు పాల్గొనడంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆ కేసులో వారికి విరుద్ధంగా తీర్పు వెలువడితే మాత్రం ఐపీఎల్‌లో పాల్గొనడం కూడా సందేహమే. ఆరోపణలపై ముందుగా స్పందించిన సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ వారిద్దరికీ రెండు మ్యాచ్‌ల వరకూ నిషేదాన్ని విధిస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు.
కానీ, సీఓఏ మరో సభ్యురాలైన డయానా ఎడుల్జీ కేసును లీగల్ సెల్‌కు తరలించగా ఎట్టకేలకు అంబుడ్స్‌మన్ కమిటీ చేతుల్లో విచారణ చేరింది. కమిటీ నివేదిక అనంతరం బీసీసీఐ తుది తీర్పును బట్టి ఈ ఇధ్దరి క్రికెటర్ల భవితవ్యం ఆధారపడి ఉంది. కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న పాండ్యా, రాహుల్‌లు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగడంతో తీవ్రత పెరిగి ఆటగాళ్ల నియమావళిని ఉల్లంఘించారంటూ విమర్శలు మొదలైయ్యాయి.
ఆ టీవీ షోలో రాహుల్ మహిళలపై ఎక్కువగా కామెంట్లు చేయకపోయినా మ్యాచ్ రోజు ముందు తెల్లవారు జాము వరకూ పార్టీలో పాల్గొని అదే రోజు సెంచరీ బాదేసినట్లు తెలిపాడు. తనతో పాటుగా హాజరైన పాండ్యా సెక్సియెస్ట్ కామెంట్లు చేసి ఎక్కువ విమర్శలకు కారకుడైయ్యాడు.