Hardik Pandya : టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా? ఆ ఒక్కటి జరిగితే..
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Hardik Pandya
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒకప్పుడు కెప్టెన్సీ రేసులో ముందు ఉండేవాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో అతడు పలు సిరీస్‌లకు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. 2022 టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ దాదాపు సంవత్సర కాలం పాటు టీ20లకు దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో టీ20 ఫార్మాట్‌లో టీమ్ఇండియా పలు సిరీస్‌లను ఆడగా.. ఆయా సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. దీంతో రోహిత్ తరువాత హార్దిక్ పాండ్యానే తదుపరి కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయ్యారు. టీ20 ప్రపంచకప్ 2024లో పాండ్యా సారథ్యంలోనే బరిలోకి దిగనున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే.. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్ చేరుకుంది. కాగా.. ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయి తృటిలో కప్ ను చేజార్చుకుంది. ఆ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. దీంతో కొన్నాళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో పరిస్థితులు అన్ని ఒక్కసారిగా మారిపోయాయి. మళ్లీ రోహిత్ శర్మ టీ20లకు వచ్చాడు. దీంతో పాండ్యా కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చింది. రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత జట్టు విజేతగా నిలిచింది. ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పారు.
ఇక హార్దిక్ పాండ్యానే టీ20లకు పర్మినెంట్ కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. అయితే.. అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను టీ20లకు రెగ్యులర్ కెప్టెన్‌గా నియమించారు. అదే సమయంలో వన్డేల్లో శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్‌గా నియమించగా, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు హార్దిక్ స్థానంలో అక్షర్‌పటేల్ వైస్ కెప్టెన్‌గా నియమించారు. దీంతో పాండ్యా కెప్టెన్సీ రేసులో లేనట్లే అని అంతా ఫిక్స్ అయ్యారు.
అదే జరిగితే.. పాండ్యానే కెప్టెన్..
అయితే.. పాండ్యా కెప్టెన్సీ రేసులోనే ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దైనిక్ జాగరణ్‌లోని నివేదిక ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా పేలవ ప్రదర్శన చేస్తే మాత్రం పాండ్యా కొత్త కెప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పేర్కొంది.
వాస్తవానికి వన్డేల్లో పాండ్యాను వైస్ కెప్టెన్ చేయాలని గంభీర్ కోరినట్లుగా సదరు కథనంలో పేర్కొన్నారు. అయితే.. రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్‌లు మాత్రం గిల్ వైపు మొగ్గు చూపినట్లుగా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో పాండ్యా టీ20ల్లో కూడా తన కెప్టెన్సీ తిరిగి పొందవచ్చునని నివేదిక సూచించింది. టీ20 ప్రపంచకప్ 2024లో వైస్ కెప్టెన్ గా పాండ్యా ఉన్నాడు. అయితే.. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడిని తొలగించారు.
గంభీర్ తో పాటు బీసీసీఐలోని పలువురు ఉన్నతాధికారులు హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఫిట్ నెస్ కారణంగానే అతడు కెప్టెన్సీ కోల్పోయాడని, ప్రస్తుతం అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హార్దిక్‌ను కెప్టెన్‌ను చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజీలో టీమ్ఇండియా తన ఆఖరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో మార్చి 2న ఆడనుంది.