IND vs ENG : ఇంగ్లాండ్ పై మెరుపు ఇన్నింగ్స్.. నాకు ముందే తెలుసు అంటూ అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో తన బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ పై అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Axar Patel comments viral after 1st odi win against england in Nagpur
ఇంగ్లాండ్ పై టీ20 సిరీస్‌ను గెలిచి ఊపుమీదున్న టీమ్ఇండియా అదే జోష్‌ను వన్డే సిరీస్‌లోనూ కనబరుస్తోంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ వచ్చింది. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల కంటే ముందుగా.. ఐదో స్థానంలోనే అతడు బరిలోకి దిగాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 47 బంతులను ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 1 సిక్స్ బాది 52 పరుగులు చేశాడు. గిల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. బౌలింగ్‌లోనూ ఓ వికెట్ సాధించాడు.
ఇక మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి అక్షర్ పటేల్ మాట్లాడాడు. తాను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగానే వస్తాను అన్న విషయం తాను ఊహించానని అన్నాడు. ఎడమ – కుడి కాంబినేషన్ నేపథ్యమే అందుకు కారణం అని వివరించాడు. ఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం బాగుందని చెప్పాడు. పవర్ ప్లే ప్రత్యర్థిని స్పిన్‌తో కట్టడి చేయాలని భావించినట్లుగా చెప్పుకొచ్చాడు. సరైన ప్రాంతంలో బంతిని వేస్తే ఫలితం దానంతట అదే వస్తుందన్నాడు. ఇక బ్యాటింగ్‌లో గిల్‌తో భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. మేమిద్దం సమయానుకూలంగా కాస్త రిస్క్ తీసుకుని ఎదురుదాడికి దిగినట్లుగా వెల్లడించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ జోస్ బట్లర్ (52; 67 బంతుల్లో 4 ఫోర్లు), జాకబ్ బెథెల్ (51; 64 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలు చేయగా.. ఫిలిప్ సాల్ట్ (43; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ (32; 29 బంతుల్లో 6 ఫోర్లు) లు రాణించడంతో 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో భారత రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు చెరో మూడు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం శుభ్‌మన్ గిల్ (87; 96 బంతుల్లో 14 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (59; 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అక్షర్ పటేల్ (52; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (2), కేఎల్ రాహుల్ (2) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్ చెరో వికెట్ సాధించారు.