IND vs ENG : తొలి వన్డే అనంతరం భారత్, ఇంగ్లాండ్ జట్ల కెప్టెన్ల కామెంట్స్.. నేను హ్యాపీ.. అబ్బే నేను లేను భయ్యా..
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ అనంతరం భారత్, ఇంగ్లాండ్ జట్ల కెప్టెన్ల మ్యాచ్ రిజల్ట్ పై స్పందించారు.

Both india and england captains comments after 1st ODI in Nagpur
మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ జోస్ బట్లర్ (52; 67 బంతుల్లో 4 ఫోర్లు), జాకబ్ బెథెల్ (51; 64 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించడంతో 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. మిగిలిన వారిలో ఫిలిప్ సాల్ట్ (43; 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్ డకెట్ (32; 29 బంతుల్లో 6 ఫోర్లు) లు ఫర్వాలేదనిపించారు. హ్యారీ బ్రూక్ (0), లిమాయ్ లివింగ్ స్టోన్ (5), జో రూట్ (19) లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా లు చెరో మూడు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం.. శుభ్‌మన్ గిల్ (87; 96 బంతుల్లో 14 ఫోర్లు), శ్రేయాస్ అయ్యర్ (59; 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అక్షర్ పటేల్ (52; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(2), కేఎల్ రాహుల్ (2)లు విపలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ చెరో రెండు వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్ లు చెరో వికెట్ సాధించారు.
నేను చాలా హ్యాపీ..
మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో గెలవడంతో తాను చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పాడు. చాలా కాలం తరువాత మేము వన్డే మ్యాచ్ ఆడాం. ఇంగ్లాండ్ బ్యాటర్లు పవర్ ప్లేలో చాలా చక్కగా ఆడారు. అయితే.. మేము పుంజుకున్న తీరు అద్భుతం. అని చెప్పాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన గానీ మిడిల్ ఓవర్లలో గిల్, అక్షర్ పటేల్‌లు చక్కగా ఆడారని కితాబు ఇచ్చాడు. ఓవరాల్‌గా ఓ జట్టుగా తాము బాగా ఆడామని చెప్పాడు. సాధ్యమైనంత వరకు ఇలాగే ఆడుతామన్నాడు
ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. తాము విజయం సాధించకపోవడంతో నిరాశచెందినట్లు చెప్పుకొచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం పై స్పందిస్తూ పవర్ ప్లే లో అద్భుతంగా ఆడామన్నాడు. అయితే.. ఆ తరువాత వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధించలేకపోయినట్లుగా వివరించాడు.
మ్యాచ్ ఆఖరిలో వికెట్ స్పందించిన తీరు చూస్తే.. మరో 40 నుంచి 50 పరుగులు చేసుంటే అప్పుడు ఫలితం మరోలా ఉండే అవకాశం ఉండేదన్నాడు. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌కు క్రెడిట్ ఇవ్వాలన్నాడు. అప్పటి వరకు మ్యాచ్ బ్యాలెన్సింగ్‌గా ఉందని, అయితే.. అయ్యర్, గిల్‌లు కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని చెప్పాడు.