IND vs ENG : గిల్ సెంచరీ కోసం ఆడతావా.. కేఎల్ రాహుల్ పై అగ్గిమీద గుగ్గిలమైన సునీల్ గవాస్కర్.. అదేం ఆట..
నాగ్‌పూర్ వన్డేలో కేఎల్ రాహుల్ చేసిన పని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు నచ్చలేదు.

KL Rahuls selfless act in Nagpur ODI doesnt sit well with Sunil Gavaskar
క్రికెట్ అనేది సమిష్టిగా ఆడే ఆట. ఏ ఒక్కరో రాణిస్తే విజయం సాధించలేరు. జట్టులోని 11 మంది ఆటగాళ్లు పోరాడితేనే విజయం దక్కుతుంది. అయితే.. కొన్ని సార్లు సహచర ఆటగాడికి సాయం చేసేందుకు వెళితే ఎదురుదెబ్బ తగలవచ్చు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో సరిగ్గా అలాంటి ఘటననే జరిగింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ పై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గిల్ సెంచరీ చేసేందుకు సాయం చేయబోయి.. తొందరగా ఔట్ కావడం పై మండిపడ్డాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
అసలేం జరిగిందంటే..?
249 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ 221/4తో దూసుకుపోతుంది. అక్షర్ పటేల్ ఔట్ కావడంతో కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే గిల్ 81 పరుగులతో ఆడుతున్నాడు. ఇంకో 16 ఓవర్లు ఉండగా.. భారత విజయానికి మరో 28 పరుగులు మాత్రమే అవసరం. ఈ సమయంలో గిల్ సెంచరీ చేస్తాడా? చేయడా అన్న ప్రశ్న అందరిలో ఉంది. అయితే.. ఆరో స్థానంలో వచ్చిన రాహుల్.. గిల్‌కు వీలైనంత ఎక్కువ స్ట్రైక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా కనిపించింది. ఈ క్రమంలో అతడు తన సహజసిద్ద ఆటను వదులుకున్నాడు. మొత్తంగా 9 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఆదిల్ రషీద్‌కు సింపుల్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
IND vs ENG : శ్రేయస్ అయ్యర్ హాట్ కామెంట్స్.. అసలు నేనీ మ్యాచ్ ఆడాల్సింది కాదు.. లక్కీగా..
ఆ సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇది జట్టు ఆట అని. రాహుల్ తన సహజ సిద్ధమైన ఆట ఆడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. తన భాగస్వామికి సెంచరీ చేయడంలో సాయం చేయబోయి ఔట్ కావడం ఎంత మాత్రం తగదని మండిపడ్డాడు.
రాహుల్ ఔట్ కావడంతో ఆ తరువాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స్ బాదాడు. దీంతో గిల్ పై ఒత్తిడి పెరిగింది. తొందరగా సెంచరీ చేయాలనే ఆవేశంలో సాకిబ్ మహమూద్ బౌలింగ్ భారీ షాట్‌కు యత్నించి బట్లర్ చేతికి చిక్కాడు. దీంతో 87 పరుగుల వద్ద గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. గిల్ ఔట్ అయినప్పటికి జడేజా(12 నాటౌట్)తో కలిపి పాండ్యా (9 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో సెంచరీ చేజార్చుకున్నప్పటికి కూడా విజయంలో కీలక పాత్ర పోషించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా గిల్ నిలిచాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 9న) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.