IND vs ENG : శ్రేయస్ అయ్యర్ హాట్ కామెంట్స్.. అసలు నేనీ మ్యాచ్ ఆడాల్సింది కాదు.. లక్కీగా..
తొలి వన్డే మ్యాచ్ అనంతరం అధికారికి బ్రాడ్ కాస్టర్‌తో మాట్లాడుతూ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

IND vs ENG 1st ODI Shreyas Iyer said I wasn't supposed to play IF Virat Kohli is fit
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (59; 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉండి ఉంటే తాను ఈ మ్యాచ్ ఆడేవాడిని కాదన్నాడు శ్రేయస్ అయ్యర్. కోహ్లీ ఆడలేకపోవడంతోనే తనకు అవకాశం వచ్చినట్లు వెల్లడించాడు.
249 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జట్టును అయ్యర్ ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపైకి ఎదురుదాడికి దిగి వారి లయను దెబ్బతీశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు రాబట్టాడు. శ్రేయస్ ఊపు చూస్తే సెంచరీ చేస్తాడని అనిపించింది. అయితే.. పార్ట్ టైం స్పిన్నర్ బెథెల్.. అతణ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గిల్‌తో కలిసి అయ్యర్ మూడో వికెట్ కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Shreyas Iyer said, “I wasn’t supposed to play today. Virat Kohli unfortunately got injured, I got the opportunity”. pic.twitter.com/0qclUE42qO
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2025
కోహ్లీ ఫిట్‌గా లేకపోవడంతో..
మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో అయ్యర్ మాట్లాడాడు. వాస్తవానికి తాను ఈ మ్యాచ్‌లో ఆడాల్సింది కాదన్నాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌గా లేకపోవడంతోనే తాను బరిలోకి దిగానన్నాడు. “మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి నేను ఓ సినిమా చూస్తున్నాను. దీంతో ఆలస్యంగా పడుకోవాలని అనుకున్నాను. అయితే.. అదే సమయంలో రోహిత్ శర్మ ఫోన్ చేశాడు. కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. రేపు మ్యాచ్‌లో నువ్వు ఆడాల్సి రావొచ్చు.. రెడీగా ఉండు అంటూ చెప్పుక్చొచాడు. దీంతో వెంటనే నేను ఫోన్ ఆపేశాను. పడుకుండిపోయాను.” అని అయ్యర్ తెలిపాడు.
ఇక మ్యాచ్‌లో ఎలాఆడాలనే విషయంపై తనకు ఓ అవగాహన ఉందన్నాడు. ప్రస్తుతం తన ఆలోచన విధానం ఎంతో మెరుగైందన్నాడు. దేశవాలీ క్రికెట్ ఆడడం తనకు ఎంతో కలిసొచ్చిందన్నాడు. తన ఆటతీరుతో పాటు ఫిట్‌నెస్ ఎంతో మెరుగైందని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
ఇక శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో నాలుగో స్థానంలో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆ స్థానంలో అతడు 34 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 4 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బెథెల్ (51), ఫిలిప్ సాల్ట్ (43)లు రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు చెరో మూడు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ లు తలా ఓ వికెట్ సాధించారు. అనంతరం లక్ష్యాన్ని భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. శుభ్‌మన్ గిల్ (87; 96 బంతుల్లో 14 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (59; 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అక్షర్ పటేల్ (52; 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు.