ఇంగ్లాండ్ బ్యాటర్లను ఉతికి ‘ఆరే’సిన బుమ్రా.. రెండో టెస్టులో పట్టుబిగించిన భారత్.. ముగిసిన రెండో రోజు ఆట
విశాఖ టెస్టులో టీమ్ఇండియా పట్టుబిగించింది.

IND vs ENG 2nd Test
IND vs ENG 2nd Test : విశాఖ టెస్టులో టీమ్ఇండియా పట్టుబిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (15) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ఇండియా 171 పరుగుల ఆధిక్యంలో ఉంది.
భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (76), బెన్ డకెట్ (21)లు ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. టీ20 స్పీడుతో ఈ జోడీ పరుగులు చేసింది. అయితే.. బెన్ డకెట్‌ను ఔట్ చేయడంతో ద్వారా కుల్దీప్ యాదవ్ బ్రేకులు వేశాడు. తొలి వికెట్‌కు జాక్-బెన్ జోడి 59 పరుగులు జోడించారు.
అదరగొట్టిన బుమ్రా..
వన్‌డౌన్‌లో వచ్చిన ఓలీపోప్ (23) జతగా జాక్ క్రాలీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పోప్ ఆచితూచి ఆడగా క్రాలీ మాత్రం తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 52 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత మరింత వేగం పెంచాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించి బౌండరీ లైన్ వద్ద శ్రేయస్ అయ్యర్ చేతికి చిక్కాడు. దీంతో 55 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
IND vs ENG 2nd Test : ఇలా వికెట్లు గాల్లోకి ఎగరడం చూసి ఎన్నాళ్లయిందో
ఈ దశలో బుమ్రా విజృంభించాడు. వరుస ఓవర్లలో జో రూట్ (5) తో పాటు ఓలీ పోప్‌ను ఔట్ చేశాడు. మరికాసేపటికే జానీ బెయిర్ స్టో(25)ను సైతం పెవిలియన్‌కు చేర్చాడు. ముఖ్యంగా ఓలీ పోప్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరో వైపు కెప్టెన్ బెన్‌స్టోక్స్ (47) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వన్డే తరహాలో అతడు బ్యాటింగ్ చేశాడు.
అతడికి కాసేపు టామ్ హార్ట్లీ (21) అండగా నిలిచాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు. బెన్ స్టోక్స్‌ను బుమ్రా ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
60 పరుగులు నాలుగు వికెట్లు..
అంతక ముందు ఓవర్ నైట్ స్కోరు 336/6తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ మరో 60 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. 5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ఆరంభించిన అశ్విన్ మరో 15 పరుగులు జోడించి అండర్సన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అశ్విన్ ఔట్ అయినప్పటికీ యశస్వి జైస్వాల్ (209; 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు) తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.
Also Read : ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరూ! పక్షిలా గాల్లోకి ఎగిరి..
179 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన జైస్వాల్.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 277 బంతుల్లో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే అతడి ద్విశతకం కావడం విశేషం. డబుల్ సెంచరీ చేసిన మరికాసేపటికే అతడు ఎనిమిదో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. యశస్వి ఔటైన తరువాత భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కవు సేపు పట్టలేదు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 396 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లు తలా మూడు వికెట్లు తీశారు. టామ్ హార్ట్లీ ఓ వికెట్ పడగొట్టాడు.