IND vs ENG: నాల్గో టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్‌షాక్.. ఆల్‌‌రౌండర్‌ సహా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు గాయాలు.. అన్షుల్ ఎంట్రీ..!

ఇంగ్లాండ్ జట్టుతో నాల్గో టెస్టుకు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఓ ఆల్‌రౌండర్ సహా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు గాయాలు కావటంతో..

IND vs ENG: నాల్గో టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్‌షాక్.. ఆల్‌‌రౌండర్‌ సహా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు గాయాలు.. అన్షుల్ ఎంట్రీ..!

Ind vs Eng 4th test

Updated On : July 21, 2025 / 8:30 AM IST

IND vs ENG : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు టెస్టు మ్యాచ్ లలో 2-1తో ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యంలో ఉంది. నాల్గో టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్ జట్టుకు ధీటైన పోటీ ఇవ్వాలని భారత జట్టు ప్లేయర్లు భావిస్తున్నారు. అయితే, నాల్గో టెస్టుకు ముందు టీమిండియాకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

తెలుగు కుర్రాడు, ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అర్ధంతరంగా ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకొని స్వదేశానికి వచ్చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం జిమ్ లో ట్రైనింగ్ సందర్భంగా నితీశ్ గాయపడినట్లు తెలిసింది. అతడి లిగమెంట్ దెబ్బతిన్నట్లు స్కానింగ్ లో తేలింది. దీంతో సిరీస్ లో మిగిలిన రెండు టెస్టులకు నితీశ్ రెడ్డి దూరంకాక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ పర్యటనలో నితీశ్ రెడ్డి రెండు టెస్టులు ఆడాడు. 45 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు.


నితీశ్ కుమార్ రెడ్డితోపాటు ఫాస్ట్ బౌలర్లు ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటికే చిన్నచిన్న గాయాలతో బాధపడుతున్నారు. అర్ష్‌దీప్‌ సింగ్ ఈ టెస్టు సిరీస్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, ప్రాక్టీస్ సమయంలో అతని చేతికి గాయమైంది. దీంతో మాంచెస్టర్ టెస్టుకు అర్ష్‌దీప్ దూరంమైనట్లు భారత క్రికెట్ వర్గాలు ధృవీకరించాయి.

మరోవైపు.. బర్మింగ్‌హోమ్ టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకాశ్ దీప్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతను కూడా నాల్గో టెస్టులో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. భారత ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఇప్పటికే మూడు టెస్టులు మాత్రమే ఆడతానని చెప్పాడు. మూడు టెస్టుల్లో రెండు ఆడాడు. అయితే, బుమ్రా నాల్గో టెస్టులో ఆడతాడని తెలుస్తోంది.

నితీశ్ రెడ్డి నాల్గో టెస్టుకు దూరమవుతుండటం భారత జట్టుకు ఇబ్బందికరమైన విషయమే. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన కారణంగా శార్దూల్ ఠాకూర్ స్థానంలో రెండో టెస్టులో నితీశ్ రెడ్డి తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడో టెస్టులోనూ కొనసాగాడు. ప్రస్తుతం నాల్గో టెస్టుకు నితీశ్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ కే అవకాశం ఇస్తారా.. మరొక ప్లేయర్ కు తుది జట్టులో చోటు లభిస్తుందా అనేఅంశం ఆసక్తికరంగా మారింది.


ఒకవేళ ఆకాశ్ దీప్ నాల్గో టెస్టుకు తుది జట్టులో చేరకుంటే హరియాణా ఫాస్ట్ బౌలర్ అన్సుల్ కాంబోజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఆకాశ్, అర్ష్‌దీప్ గాయాలను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు ముందు జాగ్రత్తగా అన్షుల్ ను ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ తో రెండు, మూడు టెస్టుల్లో ఆడిన ఆకాశ్ దీప్ ప్రస్తుతం గజ్జల్లో సమస్యను ఎదుర్కొంటున్నాడు. ప్రాక్టీస్ సమయంలో అర్ష్‌దీప్ గాయపడ్డాడు. అయితే, నాల్గో టెస్టుకు ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లు అందుబాటులో ఉంటారా.. ఉండరా అనే విషయంపై టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. టెస్టుకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో తుదిజట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.