నువ్వు సూపర్ భయ్యా.. గాయంతోనూ రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్.. కానీ, అతనికి బై రన్నర్ ఎందుకు ఇవ్వలేదు..? ఇచ్చిఉంటే..!

రిషబ్ పంత్‌ గాయంతో సింగిల్స్, డబుల్స్ తీయలేక పోయాడు. కనీసం బై రన్నర్‌ను ఇచ్చి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే..

నువ్వు సూపర్ భయ్యా.. గాయంతోనూ రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్.. కానీ, అతనికి బై రన్నర్ ఎందుకు ఇవ్వలేదు..? ఇచ్చిఉంటే..!

Updated On : July 25, 2025 / 9:33 AM IST

IND vs ENG 4th Test: ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే భారత్ జట్టు వెనకబడి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న నాల్గో టెస్టులో అద్భుత ఆటతీరుతో విజయం సాధించాలని బరిలోకి దిగిన భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వికెట్ కీపర్, కీలక బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాల్గో టెస్టులో భాగంగా మొదటిరోజు ఆటలో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన పంత్.. రిటైర్డ్ హర్ట్ గా మైదానం వదిలి వెళ్లిపోయాడు.


ఒంటికాలిపై ఆడుతూ అదరగొట్టాడు..
రెండోరోజు (గురువారం) గాయంతో ఇబ్బంది పడుతూనే రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఒక వైపు కాలుకు తగిలిన గాయం ఇబ్బంది పెడుతున్నా.. అద్భుత బ్యాటిగ్‌తో ఆఫ్ సెంచరీ (54) పూర్తి చేశాడు. ఒంటికాలితో బ్యాటింగ్ చేస్తూ.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ సైతం కొట్టాడు. సింగిల్స్, డబుల్స్ తీయకుండా కేవలం భారీ షాట్లకే పంత్ పరిమితమయ్యాడు. ఒకవేళ పంత్‌కు బై రన్నర్‌ను ఇచ్చిఉంటే భారత్ స్కోర్ మరింత పెరిగే అవకాశం ఉండేది.


బై రన్నర్ ఎందుకు ఇవ్వలేదు..
రిషబ్ పంత్‌ గాయంతో సింగిల్స్, డబుల్స్ తీయలేక పోయాడు. కనీసం బై రన్నర్‌ను ఇచ్చి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే, బై రన్నర్‌ను ఎందుకు ఇవ్వలేదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. క్రికెట్‌లో బై రన్నర్ రూల్‌ను ఐసీసీ ఎత్తేసింది. ఈ రూల్‌ను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో 2011 అక్టోబర్ 1న బై రన్నర్స్‌ను ఉపయోగించుకునే రూల్‌ను ఐసీసీ రద్దు చేసింది. అయితే, పంత్ తీవ్రగాయంతో పరుగెత్తలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలోనైనా బై రన్నర్ సహాయంతో మ్యాచ్ ఆడేలా ఐసీసీ నిబంధనలు సవరించాలంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

పంత్‌కు చప్పట్లతో స్వాగతం..
కాలికి గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ రిషబ్ పంత్ రెండోరోజు ఆటలో క్రీజులోకి వచ్చాడు. ఈ సమయంలో మైదానంలో ఇంగ్లాండ్, భారత ప్రేక్షకులు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. రిషబ్ పంత్ మ్యాచ్ ఆడుతున్నంతసేపు అతన్ని ప్రోత్సహిస్తూ ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. పంత్ ఔట్ అయ్యి మైదానం వీడుతున్న సమయంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు పంత్ భుజంతట్టి అభినందించారు.