IND vs ENG : ఇంగ్లాండ్ జట్టుకు బిగ్‌షాక్.. ఐదో టెస్టుకు స్టోక్స్‌సహా పలువురు ప్లేయర్లు ఔట్.. తుది జట్టు ఇదే..

ఐదో టెస్టు మ్యాచ్‌ను డ్రా లేదా విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు బిగ్‌షాక్ తగిలింది.

IND vs ENG : ఇంగ్లాండ్ జట్టుకు బిగ్‌షాక్.. ఐదో టెస్టుకు స్టోక్స్‌సహా పలువురు ప్లేయర్లు ఔట్.. తుది జట్టు ఇదే..

IND vs ENG 5th test

Updated On : July 31, 2025 / 7:17 AM IST

IND vs ENG : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం ఓవల్ మైదానం వేదికగా ఐదో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి (ఐదో టెస్టు) మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

ఇంగ్లాండ్‌కు బిగ్‌షాక్..
ఐదో టెస్టు మ్యాచ్‌ను డ్రా లేదా విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. అయితే, ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా ఐదో టెస్టు నుంచి వైదొలిగాడు. స్టోక్స్ ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత రెండు టెస్టుల్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో 304 పరుగులు చేయడంతోపాటు 17 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతని స్థానంలో ఓలీ పోప్ ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.


స్టోక్స్‌తోపాటు మరికొందరు ఔట్ ..
ఐదో టెస్టుకు బెన్ స్టోక్స్‌తోపాటు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, పేసర్ బ్రైడన్ కార్స్, స్పిన్నర్ లియామ్ డాసన్ సైతం దూరమయ్యారు. ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నరూ లేకుండా బరిలోకి దిగనుంది. ఓవల్ పిచ్ పై మంచి అవగాహన ఉన్న పేసర్లు ఆట్కిన్సన్, ఒవర్టన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. వోక్స్, జోష్ టంగ్ లతోకలిసి వీళ్లు పేస్ భారాన్ని పంచుకుంటారు. ఈ సిరీస్‌లో మొదటి నుంచి చివరి టెస్టు వరకు జట్టులో ఉన్న ఏకైక ఇంగ్లాండ్ బౌలర్ వోక్స్ మాత్రమే.

ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, ఆట్కిన్సన్, జోష్ టంగ్, ఒవర్టన్.