చరిత్ర సృష్టించిన సిరాజ్.. జస్ర్పీత్ బుమ్రా రికార్డు బద్దలు.. 29ఏళ్ల తరువాత అరుదైన ఘనత..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు.

చరిత్ర సృష్టించిన సిరాజ్.. జస్ర్పీత్ బుమ్రా రికార్డు బద్దలు.. 29ఏళ్ల తరువాత అరుదైన ఘనత..

Mohammed Siraj

Updated On : August 2, 2025 / 8:47 AM IST

IND vs ENG 5th Test Mohammed Siraj : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. జస్ర్పీత్ బుమ్రా రికార్డును బద్దలు కొట్టడంతోపాటు ఎలైట్ జాబితాలో వకార్ యూనిస్‌ను సమం చేశాడు.

Also Read: IND vs ENG: కళ్లుచెదిరే బంతితో.. జో రూట్‍కు దిమ్మతిరిగే షాకిచ్చిన సిరాజ్.. ఏం జరిగిందో అర్ధంకాక.. వీడియో వైరల్..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టు ఓవల్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రెండోరోజు (శుక్రవారం) ఆటలో మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. 31ఏళ్ల సిరాజ్ మెరుపు వేగంతో బంతులను సంధిస్తూ ఓలీ పోప్, జో రూట్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్‌ల వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. ప్రసిద్ధ్ కృష్టసైతం అద్భుత బౌలింగ్‌తో నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా ఇంగ్లాండ్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో సిరాజ్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.


ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ నాలుగు వికెట్లు తీయడం ద్వారా.. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టెస్టుల్లో అత్య‌ధిక ఫోర్ వికెట్ల హాల్స్ సాధించిన భార‌త బౌల‌ర్‌గా చరిత్ర సృష్టించాడు. సిరాజ్ ఇప్ప‌టివ‌ర‌కు ఇంగ్లండ్‌లో 11 టెస్టులు ఆడి ఆరు సార్లు నాలుగు వికెట్ల హాల్ సాధించాడు. అంతకుముందు ఇంగ్లాండ్ గడ్డపై ఫోర్ వికెట్ల హాల్స్ సాధించిన భారతీయ బౌలర్‌గా జస్ర్పీత్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా ఐదు సార్లు ఇంగ్లాండ్ గడ్డపై ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆ రికార్డును సిరాజ్ బద్దలు కొట్టాడు.

2021లో లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సిరాజ్ నాలుగు వికెట్ల ఘ‌న‌త సాధించాడు. ఆ త‌ర్వాత 2022లో ఎడ్జ్‌బాస్ట‌న్‌, 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నాలుగు వికెట్ల‌ను సిరాజ్ ప‌డ‌గొట్టాడు. అదేవిధంగా ప్ర‌స్తుత సిరీస్‌లో బ‌ర్మింగ్‌హామ్‌లో నాలుగుకుపైగా వికెట్లు తీసిన సిరాజ్‌.. మ‌ళ్లీ ఇప్పుడు ఓవ‌ల్ టెస్టులో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు.


ఆసియా నుంచి ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన వారి జాబితాలో వకార్ యూనుస్ (6సార్లు), ముత్తయ్య మురళీధరన్ (6సార్లు) ఉన్నారు. అయితే, 1996లో వకార్ యూనిస్ ఇంగ్లాండ్‌లో ఆరోసారి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మళ్లీ 29 సంవత్సరాల తరువాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆ రికార్డును సమం చేశాడు.

ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో అత్యధికసార్లు నాలుగు వికెట్లు తీసిన ఆసియా బౌలర్లు..
♦ మహమ్మద్ సిరాజ్ – 6 సార్లు
♦ ముత్తయ్య మురళీధరన్ – 6 సార్లు
♦ వకార్ యూనుస్ – 6 సార్లు
♦ జస్ప్రీత్ బుమ్రా – 5 సార్లు
♦ మొహమ్మద్ ఆమిర్ – 5 సార్లు
♦ యాసిర్ షా – 5 సార్లు