IND vs AFG 3rd T20 : రెండో సూపర్ ఓవర్‌లో భారత్ విజయం.. అఫ్గానిస్తాన్ పై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

IND vs AFG 3rd T20
ఏమా మ్యాచ్.. మాటల్లో వర్ణించడానికి వీలు కాదు. డబుల్ సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట ఇరు జట్లు స్కోర్లు సమం సమం కాగా.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇందులో ఇరు జట్లు 16 పరుగుల చొప్పున కొట్టడంతో మరో సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. రెండో సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 11 పరుగులు చేసింది. అఫ్గాన్ ఒక్క పరుగుకే పరిమితం కావడంతో భారత్ విజయాన్ని అందుకుంది.
స్కోర్లు సమం..
మ్యాచ్ విషయానికి వస్తే.. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (121నాటౌట్; 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగగా.. రింకూ సింగ్ (69 నాటౌట్; 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకంతో అలరించాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టాడు.
Sania Mirza : ఏదీ కష్టం.. పెళ్లి చేసుకోవడమా ? విడాకులు తీసుకోవడమా ?
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఫరీద్ అహ్మద్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అతడు ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ (4) తో పాటు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడబోయి జైస్వాల్ ఔట్ కాగా కోహ్లీ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరుసటి ఓవర్‌లో శివమ్ దూబె (1)ను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఔట్ చేయడంతో భారత్ 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రోహిత్-రింకూ రికార్డు భాగస్వామ్యం..
ఈ దశలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు నయా ఫినిషర్ రింకూ సింగ్ తీసుకున్నాడు. ఆరంభంలో వీరిద్దరు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించారు. ఒక్కసారి కుదురుకున్నాడ వీరిద్దరు అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పోటాపోటీగా బౌండరీలు బాదారు. ముఖ్యంగా రోహిత్ శర్మ పెను విధ్వంసాన్ని సృష్టించాడు. 41 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న రోహిత్ మరో 23 బంతుల్లోనే ఇంకో యాభై పరుగులను చేరుకున్నాడు అంటే అతడు ఎంత ధాటిగా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.
64 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. టీ20ల్లో హిట్‌మ్యాన్‌కు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. కాగా.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టిన రింకూ 36 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో రోహిత్ శర్మ 4,6,6,1 కొట్టగా రింకూ 6,6,6 బాదడంతో ఈ ఓవర్‌లో 36 పరుగులు వచ్చాయి.
వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా.. భారత్ మొదటి పది ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేయగా.. తర్వాతి పది ఓవర్లలో 151 పరుగులు చేయడం గమనార్హం.
Mohammed Shami : గుజరాత్ టైటాన్స్‌ను వీడనున్న శుభ్‌మన్ గిల్..? షమీ సంచలన వ్యాఖ్యలు..
213 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 212 పరుగులే చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అఫ్గాన్ బ్యాటర్లలో గుల్బాదిన్ నాయబ్ (55 నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రహ్మానుల్లా గుర్బాజ్ (50; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. మహ్మద్ నబీ (34; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), గుల్బాదిన్ నాయబ్ (32 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్‌లు చెరో వికెట్ పడగొట్టారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.