IND vs AFG 1st T20 : టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్.. మొదటి మ్యాచులో ఓడిన అఫ్గానిస్తాన్
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.

Team India
India vs Afghanistan 1st T20 : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచులో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. 159 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో శివమ్ దూబె (60నాటౌట్; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయినప్పటికీ జితేశ్ శర్మ (31; 20 బంతుల్లో 5 ఫోర్లు), తిలక్ వర్మ (26), శుభ్‌మన్ గిల్ (23) లు రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (29), ఇబ్రహీం జద్రాన్ (25), రహ్మానుల్లా గుర్బాజ్ (23) లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. శివమ్ దూబె ఓ వికెట్ సాధించాడు.
Rohit Sharma : భలే భలే మగాడివోయ్..! అతడి పేరును ఎలా మర్చిపోయావ్ రోహిత్ భయ్యా?
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్ లు మొదటి వికెట్‌కు 50 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వీరిద్దరు వేగంగా పరుగులు సాధించలేకపోయినా వికెట్ కాపాడుకుంటూ అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని గుర్భాజ్‌ను ఔట్ చేయడం ద్వారా అక్షర్ పటేల్ విడదీశాడు. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి 57/3 తో నిలిచింది.
అయితే.. అఫ్గాన్ జట్టు సీనియర్ ఆటగాడు మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ లు ఆదుకున్నారు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. నబీ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగగా.. అజ్మతుల్లా స్ట్రైకింగ్ రొటేట్ చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ జోడిని ముకేశ్ విడగొట్టారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో నజీబుల్లా జద్రాన్ (19; 11 బంతుల్లో 4 ఫోర్లు) రాణించడంతో అఫ్గాన్ 150 పరుగులు దాటింది.