T20Worldcup: భారత్ మరో ఓటమి.. సె’మిస్’ అయినట్టేనా..?

టీ 20 ప్రపంచ కప్ లో భారత జట్టు.. మరో ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

T20Worldcup: భారత్ మరో ఓటమి.. సె’మిస్’ అయినట్టేనా..?

Kohli

Updated On : November 1, 2021 / 7:36 AM IST

T20Worldcup: మ్యాచ్ మారినా తీరు మారలేదు. ప్రత్యర్థి మారినా.. ఫలితం మారలేదు. టాస్ నుంచి మొదలుపెడితే.. ఓటమి వరకూ.. సీన్ రిపీట్ అయ్యింది. టీ20 ప్రపంచ కప్ లో.. భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సెమీస్ లో చోటు కావాలంటే.. గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో.. భారత జట్టు 8 వికెట్ల తేడాతో.. న్యూజిలాండ్ చేతిలో ఛావుదెబ్బ తింది. ఈ ఓటమితో.. దాదాపుగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే దశకు చేరింది.

ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో.. ముందుగా భారత జట్టు టాస్ ఓడిపోయింది. పిచ్ కండిషన్ ఆధారంగా బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్ జట్టు.. కోహ్లీ గ్యాంగ్ ను ముప్పు తిప్పలు పెట్టింది. భారత ఆటగాళ్లు కుదురుకుంటున్నారని అనుకునే దశలో.. వికెట్లు తీస్తూ కివీస్ ఒత్తిడి పెంచింది. వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం నుంచి.. 20 ఓవర్లు ముగిసేసరికి జడేజా పుణ్యంతో భారత జట్టు.. 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. జడేజా 26 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, సోధి 2 వికెట్లు తీశారు.

లక్ష్యం చిన్నది కావడం.. రెండో సెషన్ లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో.. కివీస్ జట్టు ఆడుతూ పాడుతూ ఛేజింగ్ పూర్తి చేసింది. మిచెల్ 35 బంతుల్లో 49 పరుగులు చేశాడు. మొత్తంగా.. 14.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు.. లక్ష్యాన్ని చేరుకుని.. 8 వికెట్ల తేడాతో భారత్ పై ఘన విజయాన్ని అందుకుంది.

టాస్ ఓటమితోనే భారత జట్టుకు ఇబ్బందులు ఎదురుకాగా.. బ్యాట్స్ మెన్ క్రీజులో సరిగ్గా కుదురుకోకపోవడం.. బౌలర్లు ఆశించినంతగా ప్రభావం చూపకపోవడం.. మరింత ప్రతికూలంగా మారాయి. వరుసగా 2 మ్యాచుల్లో ఓటమితో.. మిగిలిన 3 మ్యాచుల్లో భారీ తేడాతో గెలిచి.. మెరుగైన రన్ రేట్ నమోదు చేసుకున్నా.. సెమీస్ లో చోటు కష్టంగా కనిపిస్తోంది.