IND vs BAN : అనిశ్చితిలో టీమ్ఇండియా బంగ్లాదేశ్ టూర్.. భారత జెర్సీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఇప్పట్లో చూడలేమా?
అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేలు మాత్రమే ఆడతున్న సంగతి తెలిసిందే.

India tour of Bangladesh in doubt BCCI awaits Government approval
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లు, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం వన్డేలు మాత్రమే ఆడనున్నారు. ఇక భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లోనే రో-కో ద్వయాన్ని చూడొచ్చని అంతా భావించారు.
అయితే.. ఇప్పుడు బంగ్లాదేశ్ సిరీస్ పై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌లో భారత జట్టు పర్యటించడానికి బీసీసీఐకి ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రానట్లుగా తెలుస్తోంది. గత సంవత్సరం ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పదవీచ్యుతమైనప్పటి నుండి భారత్, బంగ్లా సిరీస్ పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
సోమవారం జరిగిన మీటింగ్ తరువాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. బీసీసీఐతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపాడు. ‘మేము బీసీసీఐతో సానుకూల చర్చలు జరుపుతున్నాము. సిరీస్‌ను ఎలా నిర్వహించవచ్చనే దాని గురించి మేము చర్చలు జరుపుతున్నాము. ఒకవేళ ఆగస్టు, సెప్టెంబర్‌లో సిరీస్‌ను నిర్వహించకపోతే.. మరోసారి ఎప్పుడైనా ఈ సిరీస్‌ను షెడ్యూల్ చేస్తాము. ‘అని అమీనుల్ ఇస్లాం అన్నాడు.
ఈ సిరీస్ వాయిదా వేయాలని భారత్ అధికారికంగా ఇప్పటి వరకు కోరలేదన్నారు. అయినప్పటికి ప్రభుత్వ నిర్ణయం పైనే సిరీస్ ఆధారపడి ఉంటుందని అమీనుల్ చెప్పారు.
ఐపీఎల్ 2026 వరకు టీమ్ఇండియా బిజీ బిజీ..
ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించకుంటే ఆ తరువాత వచ్చే ఏడాది మాత్రమే పర్యటించేందుకు అవకాశం ఉంది. టీమ్ఇండియా 2026 జనవరి వరకు ఊపిరి సలపని షెడ్యూల్‌తో బిజీగా ఉండనుంది. ఆ తరువాత టీ20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ 2026 జరగనుంది. అంటే భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2026 వరకు బిజీగా ఉంటారు. ఆ తరువాతనే బంగ్లాదేశ్‌తో పర్యటించే అవకాశం ఉంది.
బంగ్లా సిరీస్ వాయిదా పడితే.. రో-కో ద్వయాన్ని చూసేది అప్పుడే..
బంగ్లాదేశ్‌తో సిరీస్ వాయిదా పడితే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమ్ఇండియా జెర్సీలో చూడాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే. అక్టోబర్‌లో భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 19న ఈ సిరీస్ ప్రారంభం కానుంది.