చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోన్న బంగ్లాదేశ్

భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా(అరుణ్ జైట్లీ స్టేడియం) వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను 7వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లాదేశ్ మరో విజయం కోసం ఎదురుచూస్తోంది. నవంబరు 7న గుజరాత్ లోని రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విజయం దక్కించుకుని సిరీస్ గెలుచుకోవాలని బంగ్లా ఆశపడుతోంది. ఈ మ్యాచ్ లోనూ పైచేయి సాధిస్తే బంగ్లా రికార్డులకెక్కుతుంది.
చివరిగా జరిగిన 9టీ20ల్లో బంగ్లాదేశ్ గెలిచిన తొలి మ్యాచ్ ఇదే కావడంతో ఇప్పటికే ప్రత్యేకత దక్కించుకుంది. దీంతో పాటు రాజ్ కోట్ వేదికగా జరిగే రెండో టీ20లో విజయం సాధిస్తే భారత్‌ను సొంతగడ్డపై ద్వైపాక్షిక సిరీస్ లో ఓడించిన తొలి జట్టు అవుతుంది. మధ్య అరేబియా సముద్రం నుంచి దూసుకొస్తున్న మహాతుఫాన్ ప్రభావం ఈ మ్యాచ్ పై పడకపోతే ఇరు జట్లలో విజేతలెవరో తెలుసుకోవచ్చు.
ఇవి కాకుండా మరో రెండు వ్యక్తిగత రికార్డులు మ్యాచ్‌పై ఆధారపడి ఉన్నాయి. సురేశ్ రైనా అత్యధిక పరుగుల రికార్డు దాటేందుకు రోహిత్ శర్మ కేవలం 9పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. 8వేల 392 పరుగులతో ఉన్న రైనాను దాటేస్తే రోహిత్ రెండో స్థానాన్ని చేరుకుంటాడు. కోహ్లీ ఇప్పటికే 8వేల 556పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బంగ్లాదేశ్ కెప్టెన్ మహమ్మదుల్లా కోసం మరో రికార్డు వేచి ఉంది. కేవలం రెండు సిక్సులు బాదితే సిక్సుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటాడు. దీంతో ఆ ఫీట్ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్ గా రికార్డు సాధిస్తాడు. తొలి టీ20 అనంతరం అక్కడ ఉన్న గాలి కాలుష్యానికి బంగ్లా క్రికెటర్ సౌమ్య సర్కార్ వాంతులు చేసుకోగా రెండో టీ20లో ఏ మేర రాణించగలదో చూడాలి మరి.