రిషబ్ పంత్ రీఎంట్రీ.! శ్రేయాస్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే..

బీసీసీఐ ప్రకటించిన జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు.

రిషబ్ పంత్ రీఎంట్రీ.! శ్రేయాస్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే..

Teamindia

IND vs BAN Test Series : స్వదేశంలో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ నెల 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే, తొలి టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ 16మంది సభ్యులతో కూడిన భారత్ జట్టును ప్రకటించింది. జట్టులో నలుగురు స్పిన్నర్లు, నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇద్దరు వికెట్ కీపర్లతో సహా మొత్తం ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ పాస్ట్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అతను ఐపీఎల్ 2024లో ఆర్సీబీ జట్టు తరపున ఆడాడు.

Also Read : కోహ్లీని ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై ..

బీసీసీఐ ప్రకటించిన జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. 20 నెలల విరామం తరువాత అతడు టెస్ట్ ఫార్మాట్లో అడబోతున్నాడు. 2022 డిసెంబర్ నెలలో బంగ్లాదేశ్ జట్టుపైనే చివరిగా పంత్ టెస్టుల్లో ఆడాడు. అదే ఏడాది డిసెంబర్ 30వ తేదీన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను కోలుకోవటానికి చాలాకాలం పట్టింది. దీంతో క్రికెట్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024తో మళ్లీ క్రికెట్ లోకి పునరాగమనం చేశాడు. ఆ తరువాత టీ20 ప్రపంచ కప్ ద్వారా భారత్ జట్టులో మళ్లీ అడుగుపెట్టాడు. ప్రస్తుతం పంత్ టెస్టుల్లోనూ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

 

తొలి టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన 16మంది సభ్యుల్లో శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. రిషబ్ పంత్ తో పాటు కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ లకు కూడా అవకాశం దక్కింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. అయితే, పేసర్ మహ్మద్ షమికి జట్టులో చోటు దక్కలేదు. బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల్లో భాగంగా తొలి టెస్టు ఈనెల 19వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు 27వ తేదీన కన్పూర్ వేదికగా జరగుతుంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ – భారత్ జట్ల మధ్య 13 టెస్టు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 11 మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. రెండు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఒక్క మ్యాచ్ లోనూ బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించలేదు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాళ్.