చెన్నై టెస్టు : అశ్విన్ మాయాజాలం, ఇంగ్లండ్ 134 రన్లు, ఆలౌట్

india vs england 2nd test : చెన్నైలో భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ టీం 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫాల్ ఆన్ నుంచి ఈ జట్టు తప్పించుకుంది. అశ్విన్ తన మాయాజాలంతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కు 195 పరుగుల అధిక్యం లభించినట్లైంది. స్పిన్ కు పూర్తిగా అనుకూలిస్తున్న ఈ పిచ్ పై భారత్ రాణిస్తోంది.
300/6 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కేవలం 29 పరుగులు మాత్రమే జోడించి ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ బరిలోకి దిగారు. ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోరీ బర్న్స్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. అశ్విన్ తన మాయాజాలం ప్రదర్శిస్తూ..అద్బుత బంతులతో బోల్తా కొట్టించాడు. 87 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది.
టీ విరామానికి ముందు వెనువెంటనే రెండు వికెట్లు పడిపోయాయి. 49వ ఓవర్‌లో 6 పరుగులు చేసిన మొయిన్ అలీ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్ వేసిన అశ్విన్ ఓలి స్టోన్‌ను అవుట్ చేసి తన ఖాతాలో 4వ వికెట్ దక్కింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. టీ విరామం అనంతరం ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో 5 పరుగులు చేసిన జాక్ లీచ్ కీపర్ పంత్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. చివరకు 134 పరుగలకు ఆలౌట్ అయ్యింది. స్టువర్ట్ బ్రాడ్‌ను ఔట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో 29వ సారి 5 వికెట్ల ఫీట్‌ను సాధించాడు. చెన్నై టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో 200 మంది లెఫ్ట్ హ్యాండర్స్ ను ఓట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పై 5 వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్ బ్యాటింగ్ : బెన్ ఫోక్స్ – 42, పోప్ – 22, బెన్ స్టోక్స్ – 18, సిబ్లీ – 16.
భారత్ బౌలింగ్ : అశ్విన్ – 5, అక్షర్ పటేల్, ఇషాంత్ కు చెరో 2 వికెట్లు, సిరాజ్ కు ఒక వికెట్ దక్కాయి.