క్లీన్ స్వీప్ దిశగా భారత్ స్కోరు

క్లీన్ స్వీప్ దిశగా భారత్ స్కోరు

Updated On : September 2, 2019 / 2:40 AM IST

వెస్టిండీస్ పర్యటనలో మూడో సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్ సాధించే దిశగా భారత్ అడుగులేస్తోంది. జమైకా వేదికగా జరుగుతున్న సిరీస్‌లో  ఆఖరిదైన రెండో టెస్టు మ్యాచ్‌లో 468 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది వెస్టిండీస్ జట్టు. టెస్టులో మూడోరోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి 45/2స్కోరుతో నిలిచింది. భారత ఆల్ రౌండర్ ప్రదర్శనతో విలవిల్లాడుతోన్న విండీస్‌కు ఫాలోఆన్‌ ఇవ్వకూడదనే భారీ లక్ష్యాన్నిచ్చి ఒత్తిడిలోకి నెట్టాలనే ఎత్తుగడతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. 

ఫాస్ట్ బౌలర్లకి అనుకూలిస్తున్న పిచ్‌పై మిగిలిన 8 వికెట్లనూ పడగొట్టడం టీమిండియాకి సునాయాసంగా కనిపిస్తోంది. అంతకుముందు ఆదివారం వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 117 పరుగులే చేసి ఆలౌటైంది. భారత పేస్‌ ఎక్స్‌ప్రెస్‌  జస్‌ప్రీత్‌ బుమ్రా (6/27) హ్యాట్రిక్‌తో విండీస్‌ను కూల్చేశాడు. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 416 పరుగులకి ఆలౌటైంది. జట్టులో హనుమ విహారి (111: 225 బంతుల్లో 16ఫోర్లు) సెంచరీ సాధించగా.. మయాంక్ అగర్వాల్ (55), విరాట్ కోహ్లి (76), ఇషాంత్ శర్మ (57) హాఫ్ సెంచరీలు సాధించారు. 

ఆ జట్టులో సిమ్రాన్ హెట్‌మెయర్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్ (14) అరంగేట్ర మ్యాచ్‌లో నిరాశపరిచాడు. వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్‌ పేలవమైన ఆరంభాన్నిచ్చారు. మరోవైపు జస్‌ప్రీత్‌ బుమ్రా ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ముగియకముందే 4 వికెట్లను తనే పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో క్యాంప్‌బెల్‌ను కీపర్‌ రిషబ్ పంత్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. మరుసటి ఓవర్లో (9వ) హ్యాట్రిక్‌ దెబ్బ తీశాడు. బ్రావో, బ్రూక్స్, ఛేజ్‌లు బుమ్రా ధాటికి పెవిలియన్ బాటపట్టారు. 8.4 ఓవర్లలో 13/4తో క్లిష్టపరిస్థితుల్లోకి వెళ్లిపోయింది విండీస్. బ్రాత్‌వైట్‌ కొంచెం ఆలస్యంగా ఔటయినా నిష్క్రమించింది మాత్రం బుమ్రా బౌలింగ్‌లోనే! ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో అతను ఔట్‌ కావడంతో విండీస్‌ 22 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌ని 168/4 వద్ద ఆదివారం డిక్లేర్ చేసింది. టీమ్‌లో అజింక్య రహానె (64 నాటౌట్: 109 బంతుల్లో 8ఫోర్లు, సిక్సు), హనుమ విహారి (53 నాటౌట్: 76 బంతుల్లో 8ఫోర్లు) అజేయ హాఫ్ సెంచరీలు బాదారు. దీంతో.. వెస్టిండీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిలిపింది.