IND vs BAN : భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా..?
ఐసిసి ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో భాగంగా డిసెంబర్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు భారత్‌లో (IND vs BAN) పర్యటించాల్సి ఉంది.
India Womens Against Bangladesh In December Likely To Be Postponed
IND vs BAN : ఐసిసి ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో భాగంగా డిసెంబర్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆతిథ్య భారత్‌తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. కాగా.. ఈ సిరీస్‌కు (IND vs BAN ) సంబంధించి వేదికలు, తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సిరీస్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
సోమవారం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ట్రిబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల సంబంధాల్లో ప్రతిష్టంభన నెలకొందని, ఈ క్రమంలోనే భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా పడినట్లు సమాచారం.
ఈ వైట్‌బాల్ సిరీస్‌లను తరువాత షెడ్యూల్ చేస్తామని తెలియజేస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ లేఖ రాసిందని క్రిక్ ఇన్ఫో తెలిపింది. అయితే.. సిరీస్ వాయిదా వేయడానికి ఖచ్చితమైన కారణం మాత్రం ఏదీ పేర్కొనలేదంది. ఇక బంగ్లాదేశ్‌తో వైట్ సిరీస్‌లు జరగాల్సిన సమయంలోనే ప్రత్యామ్నాయ సిరీస్‌కు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ సిరీస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం. ఈ విషయమై ఇప్పటికే ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నాం. బంగ్లాదేశ్ సిరీస్‌కు సంబంధించినంత వరకు మేం ముందుకు వెళ్లడం లేదు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Babar Azam : బాబర్ ఆజామ్‌కు ఐసీసీ షాక్.. దెబ్బకు సెంచరీ మత్తు వదిలింది..!
కాగా.. ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్ పర్యటన సెప్టెంబర్ 2026కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
