IPL 2020: రాజస్థాన్ రాయల్స్ కు ఆస్ట్రేలియా కోచ్

అంతర్జాతీయ క్రికెట్ తో పాటు సమంగా ఆదరణ దక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ క్రమంలో ఇప్పటికే లీగ్ లో ఆడనున్న ఎనిమిది ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు జరిగాయి. ఇందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ను మార్చుకుంది.
ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ ను రాజస్థాన్ జట్టులో మూడేళ్ల పాటు హెడ్ కోచ్ గా నియమిస్తూ కాంట్రాక్టు కుదుర్చుకుంది. గతంలో ఈయన పలు దేశీవాలీ లీగ్ లలో పాల్గొనే జట్లకు కోచ్ గా వ్యవహరించాడు. లీసెస్టర్ షైర్, విక్టోరియా, మెల్బౌర్న్ రెనెగడ్స్ లకు కోచ్ బాద్యతలు నిర్వర్తించాడు.
మెక్ డొనాల్డ్ కు ఐపీఎల్ కొత్తేం కాదు. 2009 సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ గానూ వ్యవహరించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బౌలింగ్ కోచ్ గా 2012-13లో సేవలందించాడు.
ప్యాడీ ఆప్టన్ కోచ్ గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ జట్టును డొనాల్డ్ ఎంతవరకూ విజయానికి చేరువ చేయగలడో చూడాలి. కాగా, ఐపీఎల్ ఆరంభ సీజన్ మినహాయించి 10 సంవత్సరాలుగా ట్రోఫీని అందుకోలేకపోతుంది రాజస్థాన్.