MI vs DC : ప్లేఆఫ్స్‌కు చేరుకోని ఢిల్లీ క్యాపిటల్స్.. బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జరిమానా..
ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది.

IPL 2025 MI vs DC BCCI punishes Mukesh Kumar for breaching IPL Code of Conduct
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు నిష్ర్కమించింది. బుధవారం వాంఖడే వేదికగా జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. అసలే ప్లేఆఫ్స్ కు చేరుకోని బాధలో ఉన్న ఢిల్లీకి బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు పేసర్ ముకేశ్ కుమార్‌కు జరిమానా విధించింది. అతడి మ్యాచ్‌లో ఫీజులో 10 శాతం ఫైన్ వేయడంతో పాటు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
మ్యాచ్ సందర్భంగా ముకేశ్ కుమార్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తెలిసింది.
Mukesh Kumar fined 10% of his match fees and handed one demerit point. pic.twitter.com/HEvyQGhe3F
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 22, 2025
‘ఐపీల్ ప్రవర్తనా నియమావళిలలోని ఆర్టికల్ 2.2 (ఆటకు సంబంధించిన వస్తువులు, దుస్తులు, గ్రౌండ్‌కు చెందిన ఎక్విప్‌మెంట్‌ను డ్యామేజ్ చేయడం) ప్రకారం ముకేశ్ కుమార్ లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు.’ అని ఐపీఎల్ పాలక మండలి ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా.. అతడు చేసిన తప్పు ఏమిటి అనేది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. ఈ మ్యాచ్‌లో ముకేశ్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసినప్పటికి 48 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. చమీర, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ విఫలమైంది. 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ (39) పర్వాలేదనిపించగా కేఎల్ రాహుల్ (11), ఫాఫ్ డుప్లెసిస్ (6) ఘోరంగా విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ చెరో మూడు వికెట్లు తీయగా.. బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కొ వికెట్ సాధించారు.