PBKS vs KKR : ఆన్ ఫీల్డ్ గేజ్ పరీక్షలో విఫలమైన కోల్‌కతా ప్లేయర్ అన్రిచ్ నోర్ట్జే బ్యాట్.. అంపైర్లు ఏం చేశారో తెలుసా?
ఐపీఎల్ 2025 సీజన్‌లో మైదానంలోనే ఫీల్డ్ అంపైర్లు ప్లేయర్ల బ్యాట్లను చెక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. అంచనాలకు ఏ మాత్రం అందడం లేదు. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 16 పరుగుల తేడాతో కోల్‌కతా పై విజయాన్ని సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో మైదానంలోనే ఫీల్డ్ అంపైర్లు ప్లేయర్ల బ్యాట్లను చెక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందరి బ్యాట్లను కాదుగానీ అనుమానం వచ్చిన బ్యాట్లను చెక్ చేస్తున్నారు.
బ్యాట్లను పరిశీలించేందుకు అంపైర్ ఒక గేజ్‌ని ఉపయోస్తున్నారు. బ్యాట్ మొత్తం పొడవునా గేజ్‌ని తీసుకువెలుతున్నారు. అది ఏ సమయంలోనూ కొలతలు దాటలేదని నిర్ధారించుకుంటున్నారు.
గత ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌ల్లో ఈ ఆసక్తికరమైన ప్రక్రియ ప్రారంభమైంది. ఢిల్లీక్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్‌ను చెక్ చేశారు. ఈ మ్యాచ్ కన్నా ముందు జరిగిన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లోనూ ఫిల్ సాల్ట్, షిమ్రాన్ హెట్‌మైయర్ బ్యాట్‌లను ఆన్ ఫీల్డ్ అంపైర్లు పరీక్షించిన సంగతి తెలిసిందే.
ఆన్ ఫీల్డ్ గేజ్ పరీక్షలో విఫలం..
ఇక మంగళవారం కేకేఆర్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాడు అన్రిచ్ నోర్ట్జే బ్యాట్‌ను అంపైర్లు తనిఖీ చేశారు. కేకేఆర్ తొమ్మిదో వికెట్ పడిన తరువాత బ్యాటింగ్ చేసేందుకు అన్రిచ్ నోర్ట్జే మైదానంలోకి వచ్చాడు. అప్పుడు అంపైర్ తన వద్ద నున్న గేజ్‌తో అన్రిచ్ నోర్ట్జే బ్యాట్ పరీక్షించాడు. అయితే.. బ్యాట్ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఎక్కువ వెడల్పు ఉన్నట్లు తేలింది.
Sunil Narine’s bat was checked before the start of KKR’s chase, while Anrich Nortje’s bat was checked when he walked out at No. 11 ▶️ https://t.co/OOZXi7yLJD #PBKSvKKR pic.twitter.com/oEMDrkW9mR
— ESPNcricinfo (@ESPNcricinfo) April 16, 2025
దీంతో అతడిని బ్యాట్‌ను మార్చుకోవాల్సిందిగా కోరారు. వెంటనే మరో ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి అన్రిచ్ నోర్ట్జే కు మరో బ్యాట్ ను అందించాడు.
ఇంతచేసినా.. ఈ మ్యాచ్‌లో అన్రిచ్ నోర్ట్జే తన బ్యాట్‌తో ఒక్క బంతిని ఆడలేకపోయాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ వైభవ్ అరోరా ఔట్ కావడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో అన్రిచ్ నోర్ట్జే కు ఒక్క బాల్ ఆడే చాన్స్ కూడా రాలేదు.