IPL 2025 : ఐపీఎల్ పునఃప్రారంభ తేదీ ఇదే..? ఇక డబుల్ హెడర్ మ్యాచ్‌లే..! ఫైనల్ డేట్ నో ఛేంజ్?
క్రికెట్ ప్రేమికుల దృష్టి ఇప్పుడు ఐపీఎల్ పై పడింది.

Courtesy BCCI
భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో క్రికెట్ ప్రేమికుల దృష్టి ఇప్పుడు ఐపీఎల్ పై పడింది. వాయిదా పడ్డ ఐపీఎల్‌ను ఎప్పుడు బీసీసీఐ పునఃప్రారంభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వాటాదారులు, ప్రాంచైజీలు యజమానులతో బీసీసీఐ నేడు (ఆదివారం మే11న) సమావేశం కానుంది.
కాగా.. రెవ్‌స్పోర్ట్జ్‌లోని నివేదికల ప్రకారం మే 18 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ‘ఇదే అధికారిక తేదీ అని చెప్పడం లేదు కానీ, బీసీసీఐ వీలైనంత త్వరగా లీగ్‌ను ప్రారంభించాలని చూస్తుంది.’ అని ఫ్రాంఛైజీ అధికారి తెలిపినట్లు వెల్లడించింది.
మరోవైపు పంజాబ్ కింగ్స్ మినహా అన్ని ఐపీఎల్ జట్లు మంగళవారం (మే 13) నాటికి వారి వారి వేదికలకు (హోం గ్రౌండ్‌లు) చేరుకోవాలని అన్ని ప్రాంచైజీలను బీసీసీఐ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. లీగ్ అతి త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ప్రణాళికలను తెలియజేయాలని కోరింది. దీంతో ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
ధర్మశాల కాకుండా కొత్త వేదికగా పంజాబ్ కింగ్స్ మిగిలిన తన హోం గ్రౌండ్ మ్యాచ్‌లను ఆడనున్నట్లు తెలుస్తోంది. ఏ వేదికగా పంజాబ్ ఆడనుంది అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఐపీఎల్‌ను ముందుగా షెడ్యూల్ చేసిన రోజుననే ముగించే విధంగా ఎక్కువ డబుల్ హెడర్ మ్యాచ్‌లను నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.
ఇక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 25న జరగాల్సి ఉంది.