CSK vs SRH : అయ్యయ్యో! చెన్నై ఓడిపోయిందే.. స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడంతో మైదానంలోనే ఓ స్టార్ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. అంతేకాదండోయ్ పలువురు సినీ ప్రముఖులు సైతం మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు. చెన్నై జట్టుకు, ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీకి మద్దతు ఇచ్చేందుకు వీరంతా స్టేడియానికి వచ్చారు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమిష్టి ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు నిరాశకు గురి అయ్యారు. కనీసం ధోని మెరుపులు చూసే భాగ్యం కూడా దక్కకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. స్టేడియంలోనే ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సినీతారలు కూడా ఏం మినహాయింపు కాదు.
లోకనాయకుడు కమల్‌హాసన్ కూతురిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది శ్రుతి హాసన్. కెరీర్ ఆరంభంలో వరుస పరాజయాలను చవిచూసినా ఆ తరువాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఇక ఈ అమ్మడు శుక్రవారం సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌కు హాజరైంది.
అయితే.. ఈమ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. సీఎస్‌కే బ్యాటర్లలలో డెవాల్డ్ బ్రెవిస్ (42), ఆయుష్ మాత్రే (30) రాణించగా.. దీపక్ హుడా (22), రవీంద్ర జడేజా (21) లు ఫర్వాలేదనిపించారు. ఎంఎస్ ధోని (5), సామ్ కుర్రాన్ (9), శివమ్ దూబె (12)లు విఫలం అయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ చెరో రెండు వికెట్లు తీశారు. షమీ, కమిందు మెండీస్ తలా ఓ సాధించారు.
Shruti Haasan breaks down after CSK loss ⁉️ 🥹🥹🥹😭😭#CSKvsSRH #ShrutiHaasanpic.twitter.com/vli1Dj1Ze1
— Pan India Review (@PanIndiaReview) April 25, 2025
అనంతరం లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (44), కమిందు మెండిస్ (32నాటౌట్)లు రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజాలు తలా ఓ వికెట్ తీశారు.