Urvil Patel : IPLలో సరికొత్త రికార్డ్.. ఉర్విల్ పటేల్ ఊచకోత.. 13 ప్లేఆఫ్ దిశగా చెన్నై
Urvil Patel : లక్నో సూపర్ గెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై తరఫున ఉర్విల్ పటేల్ ఊచకోత కోశాడు.
ipl 2026 csk vs lsg Result chennai super kings urvil patel fastest half century with 13 balls 50 runs
Urvil Patel : ఐపీఎల్ ప్రారంభం నుంచి వరుస ఓటములు చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్.. గత కొన్ని రోజులుగా మాత్రం ఊహించని రీతిలో సూపర్ ఫామ్ తో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇక తాజాగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి సాధించింది. ఇక నేటి మ్యాచ్ లో చెన్నై తరఫున ఉర్విల్ పటేల్ చెలరేగిపోయాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కూడా రాణించడంతో.. అద్భుతమైన స్కోర్ సాధించారు.
ఆదివారం చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. లక్నో తరఫున బ్యాట్ ఝుళిపించిన జోష్ ఇంగ్లిస్ (85).. తన మెరుపు దాడితో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఆ తర్వాత 204 పరుగుల భారీ స్కోరు లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. ప్రారంభంలోనే సంజూ శాంసన్ అవుట్ కావడంతో అభిమానుల్లో నిరాశ మొదలైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్.. చెలరేగిపోయాడు. కేవలం 13 బంతుల్లో ఓ ఫోర్, 7 సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచాడు. మొత్తం 23 బంతుల్లో ఉర్విల్ పటేల్ 2 ఫోర్లు, 8 సిక్సులతో 65 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 42 పరుగులతో తన వంతు సహకారం అందించాడు. తన హాఫ్ సెంచరీని తండ్రికి అంకితం చేస్తూ పటేల్ చేసిన సందేశం ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేసింది.
ఈ మ్యాచ్ లో చెన్నై మొత్తానికి 5 వికెట్లను కోల్పోయి.. 4 బంతులు మిగిలి ఉండగానే.. 19.2 ఓవర్లలోనే 208 పరుగులు సాధించి మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతమైన రనౌట్ కూడా చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించింది.
లక్నో జెయింట్స్ పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసులో తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. నేటి విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో పైకి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నోకు నేటి ఓటమితో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
