PBKS vs DC : ఢిల్లీ బంతి శ్రేయస్ అయ్యర్ కోర్టులో.. అక్షర్ పటేల్‌కు గోల్డెన్ ఛాన్స్..!
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ (PBKS vs DC) ఇరు జట్లకు ఎంతో కీలకం.
IPL 2026 Today do or die match to Delhi Capitals against Punjab Kings
- నేడు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్
- ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం
- ఓడిపోతే అక్షర్ సేన ఇంటికే
PBKS vs DC : ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించాయి. మిగిలిన 8 జట్లు నాలుగు స్థానాల కోసం పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఢిల్లీకి ఇది చావో రేవో మ్యాచ్ కాగా.. వరుస ఓటముల నుంచి బయటపడి విజయాల బాట పట్టి ప్లేఆఫ్స్‌కు చేరువకావాలని పంజాబ్ భావిస్తోంది.
ఈ సీజన్ ఆరంభంలో విజయాలు సాధించిన ఢిల్లీ ఆ తరువాత అనూహ్యంగా చతికిల పడింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 8 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్ రన్‌రేటు -1.154గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక పంజాబ్‌తో నేడు జరగనున్న మ్యాచ్‌లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన మూడో జట్టుగా నిలుస్తుంది. ఒకవేళ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
Andy Flower : ముంబై పై విజయం.. ఆర్సీబీ పై బీసీసీఐ చర్యలు షురూ.. హెడ్ కోచ్‌కు 15 శాతం జరిమానా
ఈ సీజన్లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ప్లే ఆఫ్స్ రేసులో అందరి కన్నా ముందు ఉన్న పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా వెనుకబడింది. ఆఖరి మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా ఓడిపోయింది. ఇప్పటి వరకు ఆ జట్టు 10 మ్యాచ్‌లు ఆడింది. ఆరు మ్యాచల్లో గెలవగా వర్షం వల్ల ఓ మ్యాచ్ రద్దైంది. మూడు మ్యాచ్‌లు ఓడిపోగా ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేటు +0.571గా ఉంది. ఢిల్లీ పై గెలిస్తే పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఓడిపోయినా పెద్దగా నష్టం లేకపోయినప్పటికి ఆ జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది.
ఢిల్లీకి ఇదే మంచి ఛాన్స్..
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఉన్న పంజాబ్ కింగ్స్‌ను ఓడించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంత కంటే మరో మంచి అవకాశం దొరకదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. శ్రేయస్ సేనను మట్టి కరిపించి తమ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఢిల్లీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
