Ishan Kishan : ఎట్టకేలకు నోరు విప్పిన ఇషాన్ కిషన్.. అలా చెప్పడం నచ్చలే.. అందుకే ఇలా.. ఎన్నాళ్లో తెలియదు
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఈ ఏడాది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.

Ishan Kishan
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఈ ఏడాది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడిని తొలగించింది. ఈ క్రమంలో అతడికి టీమ్ఇండియాలో చోటు దక్కడం లేదు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోయినా కనీసం జింబాబ్వే పర్యటనకు అయినా ఎంపిక అవుతాడని అనుకుంటే అదీ జరగలేదు. దీంతో అతడిని బీసీసీఐ పక్కకు పెట్టేసినట్లేనని వార్తలు వస్తున్నాయి.
గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్ కిషన్ మానసిక అలసట అంటూ అర్థాంతరంగా స్వదేశానికి వచ్చాడు. వరుస ప్రయాణాలు చేయడం వల్ల కుంగుబాటుకు గురైయ్యానని, విశ్రాంతి కావాలని బీసీసీఐని అతడు కోరాడు. స్వదేశానికి వచ్చిన అతడు విశ్రాంతి తీసుకోకుండా దుబాయ్ వెళ్లాడు. అక్కడ పార్టీల్లో పాల్గొనడం పై టీమ్‌మేనేజ్‌మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో తిరిగి టీమ్‌లోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ అయిన రంజీట్రోఫీలో ఆడాలని సూచించింది.
అప్పటి హెడ్ కోచ్ ద్రవిడ్‌తో పాటు బీసీసీఐ పలు మార్లు ఇషాన్ కిషన్‌కు రంజీట్రోఫీలో ఆడాలని చెప్పగా వాటిని అతడు పెడచెవిన పెట్టాడు. ఐపీఎల్ కోసం హార్దిక్ పాండ్యతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఈ పరిణామాల కారణంగా అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. ఇప్పటి వరకు వీటిపై స్పందించని ఇషాన్ తాజాగా స్పందించాడు. బీసీసీఐ అలా చెప్పడం తనకుసమంజసంగా అనిపించలేదన్నాడు.
Chris Gayle : 44 ఏళ్ల వయసులోనూ క్రిస్‌గేల్ వీరవిహారం.. దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజయం..
ఇలాంటి విషయాల గురించి తానెప్పుడూ బాధపనని ఇషాన్ చెప్పాడు. తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తానని అన్నాడు. గత ఆరు నెలలుగా డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపాడు. ప్రస్తుతం అంతా బాగుందని చెప్పడం లేదన్నాడు. చాలా కష్టంగానే ఉందన్నాడు. ఏం జరిగింది..? ఏమైంది..? అని చాలా మంది అడుగుతున్నారు. నాకే ఎందుకు ఇలా జరిగింది అనే బాధ ఉంటుందన్నాడు.
‘నేను భారీగా పరుగులు చేస్తున్నా కూడా ఎక్కువగా బెంచీపైనే కూర్చోవాల్సి వచ్చేది. జట్టుగా ఉన్నప్పుడు ఇది తప్పదు. అయితే.. ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో కుంగుబాటుకు లోనైయ్యా. దీంతో ఏదో తేడాగా అనిపించింది. బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా.. తీసుకున్నా.. ఇక ఎక్కడైనా బ్రేక్ తీసుకోవడం సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే.. మళ్లీ జట్టులోకి రావాలంటే మాత్రం దేశవాళీ క్రికెట్ లో ఆడాలనే నిబంధన ఉంది. కానీ నా విషయంలో అది సమంజసంగా అనిపించలేదు. ఎందుకంటే క్రికెట్ ఆడలేని పరిస్థితుల్లోనే కదా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నా.. మళ్లీ అలాంటప్పుడు దేశవాలీలో ఆడాలని చెప్పడం సరైందేననా.’ అని ఇషాన్ ప్రశ్నించాడు. తాను మెంటల్‌గా ఫిట్‌గా ఉంటే భారత జట్టుకే ఆడేవానని చెప్పాడు.
ఇక తాను మూడు ఫార్మాట్‌లు ఆడాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అదే సమయంలో రిషబ్ పంత్ మళ్లీ బరిలోకి దిగడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. క్వాలిటీ ప్లేయర్లతో పోటీ పడ్డప్పుడే మనసలోని అసలైన ఆట బయటకు వస్తుందన్నాడు.
ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకున్న ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో మాత్రం ఆడాడు. ముంబై ఇండియన్స్ తరుపున 14 మ్యాచుల్లో 22.85 సగటు, 148.83 స్ట్రైక్ రేటుతో 320 పరుగులు చేశాడు.