IND vs AUS 4th test : ‘బెయిల్ స్విచ్’ సాగా.. య‌శ‌స్వి జైస్వాల్‌, మిచెల్ స్టార్క్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. వీడియో..

ఆస్ట్రేలియా బౌల‌ర్ మిచెల్ స్టార్క్ బెయిల్ స్విచ్ చేశాడు.

IND vs AUS 4th test : ‘బెయిల్ స్విచ్’ సాగా.. య‌శ‌స్వి జైస్వాల్‌, మిచెల్ స్టార్క్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. వీడియో..

Jaiswal Engaged In Heated Face Off With Starc Over Bail Switching Saga

Updated On : December 30, 2024 / 11:45 AM IST

Mitchell Starc – Yashasvi Jaiswal : మెల్‌బోర్న్ వేదిక‌గా భార‌త్, ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. 340 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన భార‌త్ ఎదురీదుతోంది. ఆఖ‌రి రోజు మొద‌టి సెష‌న్‌లో ఆసీస్ బౌల‌ర్లు రాణించి మూడు వికెట్లు ప‌డ‌గొట్టగా రెండో సెష‌న్‌లో భార‌త్ అద్భుతంగా పుంజుకుంది. య‌శ‌స్వి జైస్వాల్, రిష‌బ్ పంత్ జోడి ఆసీస్ బౌల‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొని ఒక్క వికెట్ కూడా ప‌డ‌నీయ‌కుండా రెండో సెష‌ల్‌ను ముగించింది.

ఎంత‌కూ వికెట్ ప‌డ‌క‌పోవ‌డంతో విసుగుచెందిన ఆస్ట్రేలియా బౌల‌ర్ మిచెల్ స్టార్క్ బెయిల్ స్విచ్ చేశాడు. దీన్ని య‌శ‌స్వి జైస్వాల్ గ‌మ‌నించి బెయిల్స్‌ను య‌థాస్థానంలో ఉంచాడు. ఈ క్ర‌మంలో జైస్వాల్‌, స్టార్క్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచింది.

ఇటీవ‌ల కాలంలో బ్యాట‌ర్ల ఏకాగ్ర‌త దెబ్బ‌తీసేందుకు ఫీల్డింగ్ జ‌ట్టులోని ఆట‌గాళ్లు వికెట్ల పై ఉన్న బెయిల్స్‌ను మార్చి పెడుతుండ‌డాన్ని చూస్తూనే ఉంటాం. ప‌లుమార్లు ఈ ట్రిక్ వ‌ర్కౌట్ అయింది కూడా. అలాగే.. మెల్‌బోర్న్ టెస్టులో య‌శ‌స్వి ఏకాగ్ర‌త‌ను దెబ్బ తీసేందుకు మిచెల్ స్టార్క్ ప్ర‌య‌శ్నించాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్ల పై ఉన్న బెయిల్స్‌ను మార్చాడు. దీన్ని గ‌మ‌నించిన జైస్వాల్ మ‌ళ్లీ బెయిల్స్‌ను మునుప‌టి మాదిరిగానే పెట్టాడు.

Rohit – Kohli : భార‌త క్రికెట్‌కు మీ సేవ‌లు ఇక చాలు.. హ్యాపీ రిటైర్‌మెంట్ ‘రో-కో’ పై ర‌విశాస్త్రి కామెంట్స్‌ వైర‌ల్‌..

ఆ త‌రువాత స్టార్క్ బంతిని వేసి తిరిగి బౌలింగ్‌కు వెళ్లే క్ర‌మంలో మూఢ నమ్మ‌క‌మా..? అక్క‌డ మీరు ఏమి ప్ర‌య‌త్నిస్తున్నారు? అని య‌శ‌స్విని ఉద్దేశించి అన్నాడు. నన్ను నేను న‌మ్ముతున్నాను. అందుకే ఇక్క‌డ ఉన్నాను అంటూ య‌శ‌స్వి కాస్త గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చాడు. మ‌ళ్లీ స్టార్క్ రెచ్చ‌గొడుతూ.. మీ మూఢ‌న‌మ్మ‌కం కాక‌పోతే మీరు దానిని దేనికి మారుస్తున్నారు? అంటూ ప్ర‌శ్నించాడు. ప్ర‌స్తుతం నా జీవితంలో నేను ఈ క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తున్నాను అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు య‌శ‌స్వి.

భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో టీమ్ఇండియా బ్యాట‌ర్లు త‌డ‌బ‌డుతున్నారు. రోహిత్ శ‌ర్మ (9), కేఎల్ రాహుల్ (0), విరాట్ కోహ్లీ (5) లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. రిష‌బ్ పంత్ (30) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా, య‌శ‌స్వి జైస్వాల్ 208 బంతుల‌ను ఎదుర్కొని 84 ప‌రుగుల‌తో రాణించాడు. నితీశ్‌కుమార్ రెడ్డి (1), ర‌వీంద్ర జడేజా (2)లు కూడా విఫ‌లం కావ‌డంతో భార‌త్ 140 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

IND vs AUS : టీమిండియాకు బిగ్ షాక్.. ఇలా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆశలు గల్లంతే..!

ఈ వార్త రాసేస‌మ‌యానికి భార‌త్ 75 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 148 ప‌రుగులు చేసింది. ఆకాశ్ దీప్ (7), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (3) ప‌రుగులతో క్రీజులో ఉన్నాడు. భార‌త్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాలంటే మ‌రో 192 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఒక‌వేళ మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలంటే మ‌రో 17 ఓవ‌ర్లు ఆడాల్సి ఉంది. అదే ఆస్ట్రేలియా విజ‌యం సాధించేందుకు కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే అవ‌స‌రం.