IND vs AUS : టీమిండియాకు బిగ్ షాక్.. ఇలా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆశలు గల్లంతే..!

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టుకు వరుస షాక్ లు తగిలాయి..

IND vs AUS : టీమిండియాకు బిగ్ షాక్.. ఇలా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆశలు గల్లంతే..!

India vs Australia 4th Test

Updated On : December 30, 2024 / 7:24 AM IST

IND vs AUS 4th Test: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు విజయావకాశాలు ఉన్నాయి. అయితే, భారత్ బ్యాటర్లు చేజేతులా విజయావకాశాన్ని చేజార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేయగా.. భారత్ జట్టు 369 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (114) సెంచరీతో అదరగొట్టడంతో భారత్ జట్టు ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకొని 369 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 234 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఐదు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. దీంతో నాల్గో టెస్టులో విజయం సాధించాలంటే భారత్ లక్ష్యం 340 పరుగులు చేయాల్సి ఉంది.

Also Read: బంతులు కావవి, నిప్పుకణికలు..! బుమ్రా బౌలింగ్ లో అంత స్పెషాలిటీ ఏంటి?

ముగ్గురు బ్యాటర్లు ఔట్..
నాల్గో రోజు (ఆదివారం) ఆట పూర్తయ్యే సరికి రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదో రోజు (సోమవారం) ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే బుమ్రా లయన్ ను బౌల్డ్ చేయడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 234 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్ జట్టు గెలవాలంటే 340 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ప్రారంభంలో వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లుగా క్రీజులోకి రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ వచ్చారు. వారిద్దరూ కొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (9) కమిన్స్ వేసిన బంతిని ఆడబోయి గల్లీలో మార్ష్ చేతికి చిక్కాడు. దీంతో 25 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అదే ఓవర్లో డకౌట్ అయ్యాడు. దీంతో ఒకే ఓవర్లో భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (5) సైతం మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు.

Also Read: IND vs AUS 4th test : మూడు క్యాచులు మిస్ చేసిన య‌శ‌స్వి జైస్వాల్‌.. రోహిత్ శ‌ర్మ తీరు పై విమ‌ర్శ‌లు..

కీలక భాగస్వామ్యం అవసరం..
యశస్వీ జైస్వాల్, రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. వారిద్దరూ మరో వికెట్ పడకుండా ప్రస్తుతానికి నిలకడగా ఆడుతున్నారు. వీరి తరువాత రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. వీరిలో ఏ ఇద్దరు క్రీజులో పాతుకుపోయినా కనీసం మ్యాచ్ ను డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, స్కాట్ బోలాండ్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ పూర్తయ్యే వరకు ఆలౌట్ కాకుండా బ్యాటర్లు క్రీజులో ఉంటే చాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: Jasprit Bumrah: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో జస్ర్పీత్ బుమ్రా అరుదైన ఘనత..

డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే..
వచ్చే ఏడాది లార్డ్స్ లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో ఓడిపోకుండా ఉండాలి. అంటే.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్ ను టీమిండియా 2-1తో ముగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ, అలా జరగాలంటే శ్రీలంకతో జరిగే రెండు టెస్టు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ లో మాత్రమే గెలవాల్సి ఉంది. ఒకవేళ టీమిండియా జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు చేరుకోవాలంటే నాల్గో టెస్టుతో పాటు.. సిడ్నీ వేదికగా జరిగే ఐదో టెస్టులోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీలో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో లార్డ్స్ లో దక్షిణాఫ్రికాతో భారత్, ఆస్ట్రేలియా జట్లలో ఏ జట్టు తలపడుతుందనే విషయంపై ఇవాళే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.