ఇక సెలవు: మూడు ఫార్మాట్లకూ వీడ్కోలు పలికిన జోహాన్ బోథా

ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మరో మింగుడుపడని విషయం. కొద్ది నెలల ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలనం రేపిన డివిలియర్స్ బాటపట్టాడు మరో దక్షిణాఫ్రికా క్రికెటర్. శరీరం సహకరించడం లేదనే నెపంతో జోహాన్ బోథా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు తాను అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బోథా బుధవారం సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
ఈ సందర్భంగా బోథా మాట్లాడుతూ ‘ఇదొక ఉద్వేగభరితమైన క్షణం. నా కెరీర్‌లో తదుపరి ఫేజ్‌కు సమయం ఆసన్నమైందని భావిస్తున్నా. 19 ఏళ్లుగా క్రికెట్ నా జీవితంలో భాగమైపోయింది’ అని 36 ఏళ్ల బోథా పేర్కొన్నాడు. తన చివరి మ్యాచ్‌లో బోథా ఒక్క వికెట్ కూడా తీయకుండానే పేలవంగా ఇన్నింగ్స్‌ను ముగించాడు. దక్షిణాఫ్రికా తరఫున 78 వన్డే మ్యాచ్‌లు, 40 టీ20 మ్యాచ్‌లు, 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 10 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
2009లో బోథా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంకుకు చేరుకుంది. ఆ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 4-1తో ఆసీస్‌పై గెలిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 2005 నుంచి 2012 వరకూ దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన బోథా.. 2016లో ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నాడు.