Shree Charani : వరల్డ్ కప్ లో తెలుగు వారి సత్తా.. మన అమ్మాయి కూడా తక్కువేం కాదు.. కప్ గెలవడంలో…
భారత జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడంలో తెలుగు అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani ) కూడా తన వంతు పాత్ర పోషించింది.
Kadapa girl Sri charan play key role india win odi world cup first time
Shree Charani : నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ ముద్దాడింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడంలో తెలుగు అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి కూడా తన వంతు పాత్ర పోషించింది.
కడపకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి (Shree Charani)ఈ ఏడాది ఏప్రిల్‌లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా ఆమె వన్డే క్రికెట్‌లో అడుగుపెట్టింది. నిలకడగా రాణిస్తూ వన్డే ప్రపంచకప్ 2025కి సైతం ఎంపికైంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరైన చరణికి ఇదే తొలి ప్రపంచకప్ అయినప్పటికి కూడా ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు.
ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు అయితే తీయలేదు గానీ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఎంతో కీలకంగా మారింది. టీమ్ఇండియా బౌలర్లలో స్పిన్నర్ దీప్తి శర్మ (22) తరువాత అత్యధిక వికెట్లు (14) తీసిన బౌలర్‌గా నిలిచింది. ముఖ్యంగా సెమీస్‌లో ఆసీస్ పై అత్యద్భుతంగా బంతులు వేసింది. పరుగుల వరద పారిన ఆ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 4.90 ఎకానమీతో కేవలం 49 పరుగులు మాత్రమే ఇచ్చిన రెండు కీలక వికెట్లు తీసింది. ఆసీస్‌కు కళ్లెం వేసి భారత్‌కు విజయాన్ని అందించింది.
ఎందరికో స్ఫూర్తిదాయకం..
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన శ్రీచరణి ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. బ్యాటర్లను కదలికలను బట్టి బంతులు వేయడం ఆమె ప్రత్యేకత. వైవిధ్యంతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంది.
గతేడాది డబ్ల్యూపీఎల్ (WPL) మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ. 55 లక్షలకు కనుగోలు చేసింది. ఈ లీగ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రదర్శనతో పాటు దేశవాలీలో నిలకడగా రాణించడంతో జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న శ్రీచరణి, రానున్న రోజుల్లో మరింతగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
