RCB vs KKR : కోల్‌కతా వరుసగా రెండో విజయం.. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపు

RCB vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో విజయాన్ని అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఏడు వికెట్ల తేడాతో గెలిపొందింది.

RCB vs KKR : కోల్‌కతా వరుసగా రెండో విజయం.. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపు

Kolkata Knight Riders beat Royal Challengers Bengaluru by 7 wickets

RCB vs KKR : బెంగళూరుకు షాక్ తగిలింది. కోల్‌కతా వరుసగా రెండోసారి విజయాన్ని కైవసం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బెంగళూరు నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగుల చేసి బెంగళూరుపై విజయం సాధించింది. కోల్‌కతా బ్యాటర్లలో ఫిలిప్ సాల్ట్ (30; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు), సునీల్ నరైన్ (47; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సులు), వెంకటేష్ అయ్యర్ (50; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో హాఫ్ సెంచరీ), శ్రేయస్ అయ్యర్ (39) పరుగులతో అద్భుతంగా రాణించారు. బెంగళూరు బౌలర్లలో విజయ్‌కుమార్‌, మయాంక్‌ దగర్‌, యశ్‌ దయాల్‌ తలో వికెట్ తీసుకున్నారు. సునీల్ నరైన్ (47/22)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

 

కోహ్లీ అత్యధిక స్కోరు :
తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ 59 బంతుల్లో ( 4 ఫోర్లు, 4 సిక్సులు) అజేయంగా 83 పరుగులతో అత్యధిక స్కోరు చేయగా, కెమెరాన్ గ్రీన్ (33), మాక్స్‌వెల్ (28), దినేష్ కార్తీక్ (20) పరుగులకే పరిమితమయ్యారు.

మిగతా ఆటగాళ్లలో డు ప్లెసిస్ (8), రజత్ పాటిదార్ (3), అనుజ్ రావత్ (3) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్‌, రాణా తలో 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.

టీ20ల్లో 500 మ్యాచ్‌లతో నాల్గో ఆటగాడిగా నరైన్ :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా సునీల్ నరైన్ టీ20ల్లో 500 మ్యాచ్‌లు ఆడిన నాల్గవ ఆటగాడిగా నిలిచాడు. నరైన్ కన్నా ముందు, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో టీ20 ఫార్మాట్‌లో అత్యధికంగా ఆడిన ఆటగాళ్ల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. పొలార్డ్ 660 టీ20 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, బ్రావో 573 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. పాక్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ 542 టీ20 మ్యాచ్‌లతో మూడో స్థానంలో నిలిచాడు.

500వ టీ20లో నరైన్ గ్లెన్ మాక్స్‌వెల్ వికెట్‌ను తీశాడు. నాలుగు ఓవర్ల స్పెల్‌లో 40 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా, నరైన్ 500 టీ20 మ్యాచ్‌లలో 21.47 సగటుతో 3736 పరుగులు, 537 వికెట్లు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో నరైన్ అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 5/19గా నమోదైంది. పొలార్డ్ 660 మ్యాచ్‌ల్లో 31.46 సగటుతో 12,900 పరుగులు చేసి 316 వికెట్లు తీశాడు. బ్రావో 6,957 పరుగులు చేసి 625 వికెట్లు తీశాడు.

Read Also : IPL 2024 : ఐపీఎల్‌లో ‘హోమ్‌గ్రౌండ్‌’ జట్లదే హవా.. తొమ్మిది మ్యాచ్‌ల‌లో విజేతలు వారే..!