Sheffield Shield : ఆఖరి బంతికి 4 పరుగులు చేస్తే గెలుపు.. బ్యాటర్ల తడబాటు.. డ్రాగా ముగియాల్సిన మ్యాచ్ కాస్త..
ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది.

Last ball 4 runs Australian batters fumble as Draw turns into loss for Tasmania
ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. బ్యాటింగ్ టీమ్ ఫోర్ కొడితే మ్యాచ్ గెలుస్తుంది, కొట్టకపోయినా సరే మ్యాచ్ డ్రా గా ముగుస్తుంది. ఈ దశలో బ్యాటింగ్ టీమ్ ఓడిపోతుందని ఎవ్వరైనా ఊహిస్తారా..? బౌలర్ వికెట్ తీయకపోయినా సరే.. బ్యాటర్లు అనవసర పరుగు కోసం ప్రయత్నించడంతో మ్యాచ్ ఓడిపోయింది. ఈ ఘటన ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌లో సౌత్ ఆస్ట్రేలియా, టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత సౌత్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 398 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం టాస్మానియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌత్ ఆస్ట్రేలియాకు 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌లో సౌత్ ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 233 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో టాస్మానియా జట్టు ముందు 428 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.
టిమ్ వార్డ్ (142) భారీ శతకంతో చెలరేగడంతో టాస్మానియా లక్ష్యానికి చేరువగా వచ్చింది. ఆఖరి ఓవర్‌లో టాస్మానియా విజయానికి ఏడు పరుగులు కావాలి. క్రీజులో గేబ్ బెల్, లారెన్స్ నీల్-స్మిత్ లు ఉన్నారు. సౌత్ ఆస్ట్రేలియా బౌలర్ వెస్ అగర్ బంతిని అందుకున్నాడు. తొలి బంతికి స్మిత్ సింగిల్ తీయగా రెండో బంతి డాట్ అయ్యింది. మూడో బంతికి బెల్ ఔట్ అయ్యాడు. నాలుగో బంతికి మెరెడిత్, ఐదో బంతికి స్మిత్ సింగిల్ తీశాడు.
ఆఖరి బంతికి ఫోర్ కొడితే టాస్మానియా విజయం సాధిస్తుంది. వెస్ ఆగర్ యార్కర్ వేయగా మెరెడిత్ షాట్ ఆడాడు. బంతి ఫీల్డర్ వద్ద వెళ్లింది. ఈ లోగా బ్యాటర్లు ఒక్క పరుగు పూర్తి చేశారు. అయితే.. మెరిడెత్ అనవసరంగా రెండో పరుగు కోసం యత్నించాడు. గమనించిన ఫీల్డర్ బంతిని బౌలర్‌కు త్రో చేయగా బౌలర్ వికెట్లను పడగొట్టాడు. మెరిడెత్ రనౌట్ అయ్యాడు. దీంతో సౌత్ ఆస్ట్రేలియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
డ్రా లేదా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్మానియా ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు నిరాశకు గురి అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Four to win off the last ball of the match, nine wickets down… and Meredith gets run out coming back for a meaningless second run?!
Insane finish to the #SheffieldShield match between @SACricketTeams and @crickettas 🤯 pic.twitter.com/Yz2gffKshz
— Will Faulkner (@willzfaulk) December 9, 2024