IND vs AUS : రెండో టెస్టులో భారత్ పై విజయం.. 24 గంటల్లోనే ఆస్ట్రేలియా ఆనందం ఆవిరి.. కొంపముంచిన దక్షిణాఫ్రికా..
రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పై విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.

WTC Points Table South Africa dethrone Australia after 24 hours with 109 run win over Sri Lanka
రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పై విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. పింక్ బాల్ టెస్టులో గెలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే.. 24 గంటలు గడవకముందే ఆసీస్ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. శ్రీలంక పై ఘన విజయాన్ని సాధించిన దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది.
టెంబా బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక పై 109 పరుగల తేడాతో విజయాన్ని సాధించింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. త్వరలో స్వదేశంలో సపారీ జట్టు పాకిస్థాన్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. ఇందులో ఒక్క మ్యాచులో విజయం సాధించినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా చేరుకుంటుంది. అప్పుడు రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య పోటీ ఉంటుంది.
10 టెస్టుల్లో 6 విజయాలు సాధించి ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63.33 శాతం విజయాలతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత ఆస్ట్రేలియా 14 టెస్టుల్లో 9 గెలిచి 60.71 శాతం విజయశాతంతో రెండులో ఉండగా, భారత్ 16 మ్యాచుల్లో 9 గెలిచి 57.29 శాతంతో మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురైన శ్రీలంక జట్టు 45.45 విజయశాతంతో నాలుగులో, ఇంగ్లాండ్ 45.24 విజయశాతంతో ఐదులో ఉన్నాయి.
భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలంటే..?
వరుసగా మూడో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుకోవాలని భారత్ ఆరాట పడుతోంది. అయితే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టులో ఓడిపోయి తన అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకోవడంతో భారత్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన మూడు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధిస్తే.. అప్పుడు 63.15 విజయశాతంతో టీమ్ఇండియా పైనల్‌కు చేరుకుంటుంది.
ఒకవేళ మూడు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ ఓడినా సరే 57.89 శాతానికి.. విజయశాతం పడిపోతుంది. అప్పుడు దక్షిణాఫ్రికాను పాకిస్థాన్ 2-0 తేడాతో ఓడించాల్సి ఉంటుంది అదే సమయంలో శ్రీలంక స్వదేశంలో ఆస్ట్రేలియా పై సిరీస్ గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచులోనైనా గెలవాలి. లేదంటే రెండు టెస్టులు డ్రా ముగియాలి.