IND vs ENG Test: వాళ్లేం పాపం చేశారు..! ఆ ఇద్దరు ప్లేయర్లను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు.. తొలి టెస్టుకు ముందు గౌతమ్ గంభీర్ పై మహ్మద్ కైఫ్ ఫైర్..
మహమ్మద్ కైఫ్ జట్టు ఎంపికకు సంబంధించి తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

Mohammad Kaif Gautam Gambhir
IND vs ENG 1st Test: ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇవాళ (భారత కాలమానం ప్రకారం) మధ్యాహ్నం 3.30గంటలకు తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇది. దీంతో తుది జట్టులో ఎవరెవరికి స్థానం దక్కుతుంది.. ఏ బ్యాటర్ ఏ స్థానంలో క్రీజులోకి వస్తాడనే అంశంపై క్రీడాభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇదేక్రమంలో మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్టు చేశాడు. అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ పేర్లను ప్రస్తావిస్తూ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్, సెలక్టర్ల తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహమ్మద్ కైఫ్ జట్టు ఎంపికకు సంబంధించి తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. IPLలో అత్యధిక పరుగులు చేసి సంచలనం సృష్టించిన బ్యాట్స్‌మన్‌ను మినహాయించాలని సలహా ఇవ్వడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు, అలాగే సెలెక్టర్లు చేసిన పెద్ద తప్పు ఇదేనంటూ ఎత్తి చూపారు.
‘‘సాయి సుదర్శన్ కంటే ముందు అభిమన్యు ఈశ్వరన్ ప్లెయింగ్ ఎలెవన్ లో ఉండటానికి అర్హుడు. ఈశ్వరన్ చేసిన 27 ఫస్ట్ క్లాస్ సెంచరీలు, దాదాపు 8వేల ఫస్ట్ క్లాస్ పరుగులను గౌరవించాలి. ఇంగ్లాండ్ లో ఇండియా ఎ తరపున పరుగులు చేసిన సర్ఫరాజ్ ను తొలగించడం ద్వారా సెలెక్టర్లు తప్పు చేశారు. లీడ్స్ టెస్టు నుంచి ఈశ్వరన్ ను దూరంగా ఉంచడం ద్వారా వారు దానిని పునరావృతం చేయకూడదు.’’ అంటూ మహ్మద్ కైఫ్ బీసీసీఐ, కోచ్ గౌతం గంభీర్ నిర్ణయాలను తప్పుబట్టారు.
Abhimanyu Easwaran deserves to be in the playing XI before Sai Sudarshan. Easwaran’s 27 first-class hundreds, almost 8k FC runs need to be respected. By dropping Sarfraz, someone who scored runs for India A in England, selectors made a mistake. They shouldn’t repeat it by keeping…
— Mohammad Kaif (@MohammadKaif) June 19, 2025
ఆ ఇద్దరు ప్లేయర్లను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు..?
టెస్టు సిరీస్ కు ముందు ఇండియా-ఎ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో రెండు అనధికారిక టెస్టు మ్యాచ్ లు ఆడింది. ఇందులో అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గా ఉన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ మొదటి అనధికారిక టెస్టులో 92 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, రెండో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చేరడంతో తుది జట్టులో అతనికి అవకాశం రాలేదు. దీని తరువాత సర్ఫరాజ్ మళ్లీ తన ప్రతిభను చూపించాడు. ఇంట్రా-స్వ్కాడ్ మ్యాచ్ లో 101 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో అభిమన్యు ఈశ్వరన్ కూడా ఈ సిరీస్ లో నిలకడగా మంచి ఇన్సింగ్స్ ఆడి ఇంగ్లాండ్ పరిస్థితుల్లో తనను తాను నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 92 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ తో టెస్టు జట్టులో అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ లకు చోటు కల్పించక పోవటం పట్ల సెలెక్టర్ల తీరును మహ్మద్ కైఫ్ తప్పుబట్టారు. అనుభవం, గణాంకాలను గౌరవించాలని కైఫ్ అభిప్రాయపడ్డారు.