CSK vs KKR : వరుసగా ఐదో మ్యాచ్‌లో చెన్నై ఓటమి.. ధోని కామెంట్స్ వైరల్.. మేం ఎందుకు ఓడిపోతున్నామంటే..
కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిపోయిన తరువాత చెన్నై సూపర్ కెప్టెన్ ధోని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Courtesy BCCI
కెప్టెన్ మారినా చెన్నై సూపర్ కింగ్స్ రాత మారలేదు. ఎంఎస్ ధోని సారథ్యంలోనైనా చెన్నై విజయాల బాట పడుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. శుక్రవారం చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం. అటు కేకేఆర్‌కు మూడో విజయం.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. శివమ్ దూబె (31 నాటౌట్; 29 బంతుల్లో 3 ఫోర్లు), విజయ్ శంకర్ (29; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్)లు పర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు సాధించాడు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి లు తలా రెండు వికెట్లు తీశారు. వైభవ్ అరోరా, మోయిన్ అలీలు చెరో వికెట్ పడగొట్టారు.
RCB vs DC : రజత్ పాటిదార్ కెప్టెన్సీ పై కోహ్లీ అసంతృప్తి..? దినేశ్ కార్తీక్‌తో సుదీర్ఘ సంభాషణ..
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ 10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరైన్ (44; 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. క్వింటన్ డికాక్ (23), అజింక్యా రహానే (20 నాటౌట్), రింకూ సింగ్ (15నాటౌట్)లు రాణించారు.
కేకేఆర్ చేతిలో చెన్నై ఓడిపోవడంతో ధోని నిరాశ చెందాడు. మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై మహేంద్రుడు మాట్లాడుతూ.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చాడు. బ్యాటర్లు విఫలం అయ్యారని అన్నాడు. స్కోరు బోర్డు పై తగినన్ని పరుగులు లేవని అంగీకరించాడు. వికెట్లు పడినప్పుడు జట్టు పై ఒత్తిడి వస్తుందన్నాడు.
‘ఒక్క మెరుగైన భాగస్వామ్యాన్ని కూడా నమోదు చేయలేకపోయాం. పవర్‌లో దూకుడుగా ఆడాల్సింది. కానీ 31 పరుగులు మాత్రమే చేశాం. ఓపెనర్లు కాన్వే, రచిన్ రవీంద్ర లు ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. అయితే.. వాళ్లు ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయారు.’ అని ధోని అన్నాడు.
వీరిద్దరూ ప్రామాణికమైన క్రికెట్ షాట్లు మాత్రమే ఆడతారని, వీరు లైన్ దాటి కొట్టడానికి ప్రయత్నించరు అంటూ ఓపెనర్ల పై ధోని విమర్శలు గుప్పించాడు. ఓపెనర్లు రిస్క్ తీసుకుని షాట్లు ఆడాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ల్లో గెలవాలంటే భాగస్వామ్యాలు నమోదు చేయాలన్నాడు.
ఓపెనర్లు అద్భుతంగా ఆడితే మిడిల్ ఆర్డర్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలదని చెప్పాడు. ప్రారంభంలోనే వికెట్లు పడితే.. మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతుందని, అప్పుడు వారు ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తారన్నాడు. అప్పుడు భారీ షాట్లు కొట్టేందుకు చాలా సమయం తీసుకుంటారని, ఇది స్కోరు పై ప్రభావం చూపిస్తుందన్నాడు.