ఫన్నీ మూమెంట్: అభిమానిని పరుగులు పెట్టించిన ధోనీ

ఫన్నీ మూమెంట్: అభిమానిని పరుగులు పెట్టించిన ధోనీ

Updated On : March 6, 2019 / 8:45 AM IST

అభిమానులను రిసీవ్ చేసుకోవడమే కాదు. వారితోనూ ఆత్మీయతను చాటడంలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందుంటాడు. కొనేళ్లుగా ఫేవరేట్ క్రికెటర్‌గా వేల మంది గుండెల్లో స్థానం దక్కించుకున్న ధోనీని కలుసుకోవడానికి స్టేడియంలోకి అభిమానులు దూసుకొచ్చిన సందర్భాలు కోకొల్లలు. మంగళవారం విదర్భ వేదికగా ముగిసిన రెండో వన్డేలో ధోనీని కలిసేందుకు వచ్చిన అభిమానిని ధోనీ ఆటపట్టించాడు. పరుగులు పెట్టించాడు. చివరికి బతిమాలుకున్న తర్వాత అతనిని కలిసి ఓ హగ్ ఇచ్చాడు. 

మ్యాచ్ విజయానంతరం టీమిండియా విజయసంబరాల్లో మునిగిపోయింది. అలాగే నడుచుకుంటూ స్టేడియం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు బయల్దేరింది. ఈ లోపే స్టేడియంలోకి ఓ అభిమాని దూసుకొచ్చాడు. తన కోసమే వస్తున్నాడని పసిగట్టిన ధోనీ రోహిత్ శర్మ వెనుక దాక్కున్నాడు. ధోనీ నుంచి వచ్చిన అనూహ్య స్పందనకు అభిమాని ఆశ్చర్యానికి గురై పట్టుకునేందుకు ప్రయత్నించాడు. 
Also Read : పేరు చెప్పొద్దు.. ఆడి చూపించు : IPL 2019 సాంగ్ రిలీజ్

అంతే, అతనికి అందకుండా ధోనీ పరుగు లంకించుకున్నాడు. కాసేపటి వరకూ స్టేడియంలో అటుఇటూ గింగిరాలు తిరుగుతూ 20 సెకన్లలోనే చాలా దూరం పరిగెత్తించేశాడు. ఆ తర్వాత ధోనీని బతిమాలడంతో ఆగి అభిమానిని హగ్ చేసుకున్నాడు. 

రెండో వన్డేలో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. సిరీస్‌లో ఆసీస్‌పై 2-0 ఆధిక్యంతో దూసుకెళ్తోంది. 
 

Also Read : కోహ్లీ, విజయ్‌లు మ్యాచ్‌‌ను ఇలాగే గెలిచారా?