రాయుడు జాగ్రత్త.. ధోనీకి వార్నింగ్ ఇచ్చిన అంపైర్

చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. చెన్నై బ్యాట్స్ మన్ అంబటి రాయుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో జరిగిన ఘటన అంపైర్ హెచ్చరింతవరకూ తీసుకొచ్చింది. శనివారం చెపాక్ స్టేడియం వేదికగా సూపర్ కింగ్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ ను మాన్కడింగ్ విధానం ద్వారా అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ మరోసారి అదే పద్ధతిని చెన్నైతో మ్యాచ్ లోనూ ప్రయోగించాలని చూశాడు.
అయితే ముందుస్తు హెచ్చరికగా అంపైర్ కు తెలియజేయడంతో రాయుడును జాగ్రత్తగా ఉండాలని కెప్టెన్ ధోనీకి సూచనలు అందాయి. బట్లర్ ను అవుట్ చేసినప్పుడు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా అశ్విన్ ప్రవర్తించాడని ముందుగానే హెచ్చరించి ఉండాల్సిందంటూ విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలోనే రాయుడును జాగ్రత్తగా ఉండాలని అంపైర్ రాడ్ టక్కర్ హెచ్చరించాడు.
ఈ విషయంపై పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నేనేం చేసినా అందరి కళ్లు నా మీదనే ఉంటున్నాయి. కానీ, ఒక్క రూపాయి దొంగిలించినా దొంగతనమే అంటారు కదా. అయినా నా హద్దుల్లో నేను ఉంటా. తప్పనుకున్న పని చేయను. చేయాలనుకునేదానిపై స్పష్టంగా ఉంటా. ఎప్పుడో ముగిసిపోయినా మళ్లీ మళ్లీ ఈ విషయంపై మాట్లాడుతూనే ఉన్నారు’ అని అశ్విన్ తెలియజేశాడు.