IND vs NZ : రిషబ్ పంత్‌ను ఆకాశానికి ఎత్తేసిన కివీస్ మీడియా.. రోహిత్ శర్మ కెప్టెన్సీని మాత్రం..
టామ్ లాథమ్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు భారత్ పై చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది.

New Zealand media react to unfathomable India whitewash
IND vs NZ : టామ్ లాథమ్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు భారత్ పై చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. మూడు మ్యాచుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్లీప్ చేసింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో, పూణేలో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో, ముంబై వేదికగా జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో కివీస్ టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఆ దేశ మీడియా తమ టీమ్‌ను అమాంతం ఆకాశానికెత్తేసింది.
ముఖ్యంగా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్ లపై ప్రశంసల వర్షం కురిపించింది. అదే సమయంలో టీమ్ఇండియాకు చెందిన ఇద్దరు ప్లేయర్లను హైలైట్ చేసింది. ఆ ఇద్దరిలో ఒకరు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాగా.. రెండో ప్లేయర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.
పేలవ ఫామ్‌తో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలం అయిన రోహిత్ శర్మ.. జట్టును నడిపించడంలోనూ తడబడ్డాడు. ఇదే విషయాన్ని కివీస్ మీడియా ఎత్తి చూపించింది. అనవసరంగా షాట్లకు వెళ్లి వికెట్‌ను సమర్పించుకున్నాడని న్యూజిలాండ్ హెరాల్డ్, స్టఫ్.కో.ఎన్‌జడ్, వన్‌న్యూస్.కో.ఎన్‌జడ్, ఆర్‌ఎన్‌జడ్ తదితర మీడియా సంస్థలు తెలిపాయి.
ఇక మూడో టెస్టు మ్యాచ్‌లో బ్యాటర్లు అంతా విఫలం అయినా కూడా జట్టును గెలిపించేందుకు పోరాడిన రిషబ్ పంత్‌ను మాత్రం ప్రశంసించింది. ఈ మ్యాచ్‌లో పంత్ 57 బంతులు ఎదుర్కొన్నాడు. 9 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 64 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.