Shubman Gill: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్.. భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
కరుణ్ కు చాలా అనుభవం ఉంది. అతను అక్కడ కౌంటీ క్రికెట్ ఆడాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని అనుభవం ఉపయోగపడుతుంది.

Shubman Gill: భారత టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముంబైలో తన తొలి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత బ్యాటింగ్ ఆర్డర్ గురించి మీడియా ప్రతినిధులు గిల్ ను అడిగారు. బ్యాటింగ్ ఆర్డర్ గురించి మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదని గిల్ తెలిపాడు. మాకు ఇంకా కొంత సమయం ఉందని చెప్పాడు. ”మేము ఇంట్రా-స్క్వాడ్ ఆడతాము. లండన్‌లో 10 రోజుల క్యాంప్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌ను నిర్ణయిస్తాము” అని గిల్ వెల్లడించాడు.
ఇప్పటివరకు 32 టెస్టులు ఆడిన పంజాబ్‌కు చెందిన ఈ 25 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రకారం, లండన్‌లో జరిగే 10 రోజుల క్యాంప్ తో పాటు ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ గేమ్ తర్వాత భారత జట్టు యాజమాన్యం బ్యాటింగ్ ఆర్డర్‌ను నిర్ణయిస్తుందని తెలుస్తోంది.
మే 7న రోహిత్ శర్మ, 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. వారి స్థానంలో ఎవరు ప్లేయింగ్ XIలో ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. KL రాహుల్ ఓపెనర్ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, కోహ్లీ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
భారత జట్టులో ప్లేయింగ్ XIలో 4వ బ్యాటర్‌గా చోటు కోసం కరుణ్ నాయర్, గిల్ మధ్య ప్రధాన పోటీ ఉంది. ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన నాయర్, జూన్ 20 నుండి లీడ్స్‌లో జరిగే తొలి టెస్ట్‌కు భారత జట్టులో ఎంపిక కావడానికి అవకాశం ఉంది. గత వారం ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా A తరపున డబుల్ సెంచరీ (204) సాధించాడు. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.. కరుణ్ ఆటను ప్రశంసించాడు. ప్లేయింగ్ XIలో అతనిని చేర్చే అవకాశం ఉందని సూచించాడు.
”కరుణ్ కు చాలా అనుభవం ఉంది. అతను అక్కడ కౌంటీ క్రికెట్ ఆడాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని అనుభవం ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా, ఒకటి లేదా రెండు టెస్ట్ మ్యాచ్‌లను బట్టి మనం ఒకరిని అంచనా వేయలేము” అని గంభీర్ అన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో భారీ పరుగులు చేసిన తర్వాత నాయర్ భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. రెడ్-బాల్ జట్టు కెప్టెన్‌గా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ గిల్‌కు మొదటిది.