RCB : ఫైనల్లో గెలిచిన ఆర్సీబీ.. అభిమానులకు మాత్రం బ్యాడ్ న్యూస్.. అదే కారణమా..!
RCB : వరుసగా రెండో సారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
No Victory Parade For RCB won IPL 2026 title Clear Message From Team To Fans
- అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన ఆర్సీబీ
- ఈసారి విక్టరీ పరేడ్ లేదు
- గతేడాది అనుభవంతో ఈ నిర్ణయం
RCB : ఐపీఎల్-19 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 17 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూసిన ఆర్సీబీ.. పోయిన సంవత్సరం టైటిల్ గెలిచింది. ఆ విజయాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది కూడా కప్పు గెలిచింది. ఆర్సీబీ గెలుపుతో అటు బెంగళూరులోనే కాక ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి. కప్పు గెలిచిన సంతోషంలో ఆర్సీబీ జట్టు అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
ఈసారి విక్టరీ పరేడ్ లేదు: ఆర్సీబీ ప్రకటన
ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈసారి విక్టరీ పరేడ్ నిర్వహించేది లేదంటూ అభిమానులకు తేల్చి చెప్పింది. అందుకు కారణం గతేడాది జరిగిన సంఘటన. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పోయిన ఏడాది అంటే 2025లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలిచింది. ఈ క్రమంలో ఆర్సీబీ విక్టరీ పరేడ్ (విజయ యాత్ర) నిర్వహించింది. అయితే దీనికి అనుకున్న దానికన్నా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో.. తొక్కిసలాట జరిగి సుమారు 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనతో ఈ ఏడాది బెంగళూరులో ఆర్సీబీ అసలు మ్యాచ్‌లు ఆడుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఈసారి విక్టరీ పరేడ్ నిర్వహించబోయేది లేదని ఆర్సీబీ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా పోస్ట్ చేసింది.
“ఎంతటి అద్భుతమైన రాత్రి. ఎంతటి గొప్ప అనుభూతి. ఆర్సీబీ అభిమానులందరికీ అభినందనలు. ఈ విజయం మీదే. వేడుకలు మొదలవుతున్న వేళ, మనమంతా మరింత బాధ్యతాయుతంగా ఉందాం. మీ ప్రియమైన వారితో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అత్యుత్తమ మార్గం. ఇంట్లోనే ఉంటూ ప్రశాంతంగా ఈ ప్రత్యేక క్షణాలను ఆస్వాదించండి, ఆ జ్ఞాపకాలను నెమరువేసుకోండి. వచ్చే ఏడాది స్టేడియంలో కలుద్దాం. అంతవరకు, సంతోషాన్ని పంచుతూ మాకు మద్దతుగా నిలవండి. #PlayBold #????RCB #IPL2026,” అని ఆర్సీబీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చింది.
ఈ సందేశాన్ని బట్టి చూస్తే, ఈ ఏడాది విజయం తర్వాత జట్టు ఎం. చిన్నస్వామి స్టేడియానికి తిరిగి రాకపోవచ్చనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కృనాల్ పాండ్యా ఆనందం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా.. ఫ్రాంచైజీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలవడంపై స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. వారి ఓపికకు, పక్కా ప్రణాళికకు దక్కిన ప్రతిఫలం ఈ విజయం అంటూ అభివర్ణించారు. అదే సమయంలో తాను ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న మైలురాయిని కూడా ఈ సందర్భంగా ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు. 11 సీజన్లలో ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన తర్వాత కృనాల్ తన వ్యక్తిగత విజయంపై స్పందిస్తూ.. “నా 11 ఏళ్ల కెరీర్లో ఐదు ట్రోఫీలు సాధించడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఇది నాకు నిజంగా ఎంతో ప్రత్యేకం” అని చెప్పారు.
