Champions Trophy: భారత్ చేతిలో ఓడినప్పటికీ పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశం..! ఎలా అంటే..
భారత్ జట్టుపై ఓటమి తరువాత పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపుగా నిష్ర్కమించినట్లేనని చెప్పొచ్చు. అయితే..

Pakistan team
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. పాకిస్తాన్ జట్టు టోర్నీ నుంచి దాదాపుగా నిష్ర్కమించినట్లేనని చెప్పొచ్చు. అయితే, కివీస్ జట్టు గెలుపోటములపై పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్స్ కు అర్హత సాధించాలంటే ముందుగా గ్రూప్ దశలో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించాలి. నెట్ రన్ రేట్ ను దృష్టిలో పెట్టుకొని పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ పై భారీ విజయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికితోడు న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో బంగ్లాదేశ్, భారత్ జట్టు గెలవాలి. అలా అయితే.. టీమిండియా సెమీఫైనల్స్ చేరుకుంటుంది. మిగిలిన మూడు జట్లు ఒక్కో విజయంతో పాయింట్ల పట్టికలో ఉంటాయి. అప్పుడు రన్ రేట్ ఆధారంగా సెమీస్ కు వెళ్లే జట్టును నిర్ణయిస్తారు. అప్పుడు రన్ రేట్ విషయంలో పాకిస్థాన్ జట్టు బంగ్లా, న్యూజిలాండ్ జట్లకంటే మెరుగ్గా ఉంటే పాకిస్థాన్ సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.
Also Read: IND vs PAK : కోహ్లీ సెంచరీ.. పాక్ పై భారత్ ఘన విజయం..
పాకిస్థాన్ జట్టు సెమీస్ కు వెళ్లే అవకాశాలు దాదాపు లేవనే చెప్పొచ్చు. న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్ పై కన్నేసింది. ఇప్పటికే పాకిస్థాన్ జట్టుపై విజయంతో కివీస్ ఆటగాళ్లు ఉత్సాహంతో ఉన్నారు. సోమవారం బంగ్లాదేశ్ జట్టుతో న్యూజిలాండ్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే గ్రూప్-ఏ నుంచి భారత్ జట్టుతోపాటు న్యూజిలాండ్ జట్టుకూడా సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు నిష్క్రమిస్తాయి.
ప్రస్తుతం గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. భారత్ జట్టు అగ్రస్థానంలో ఉంది. రెండు మ్యాచ్ లు ఆడిన భారత్ .. రెండింటిలోనూ విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్ జట్టు రన్ రేట్ 0.647గా ఉంది. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి రెండో స్థానంలో ఉంది. కివీస్ రన్ రేట్ 1.200. ఇక బంగ్లాదేశ్ జట్టు రన్ రేటు -0.408కాగా.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు రన్ రేటు -1.087గా ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ కు చేరాలంటే బంగ్లాదేశ్ పై భారీ విజయం సాధించాలి. అదే సమయంలో ఇండియాపై న్యూజిలాండ్ జట్టు భారీ ఓటమిని చవిచూడాల్సి ఉంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ పైనా కివీస్ జట్టు ఓడిపోవాల్సి ఉంటుంది.