IIT Baba : ఇప్పుడు నీ జోస్యం ఏమైంది? పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందన్న ఐఐటీ బాబాను ఏకిపారేసిన నెటిజన్లు..
భారత్ పాక్ మ్యాచ్ అయిపోగానే.. ఐఐటీ బాబాను క్రికెట్ లవర్స్, నెటిజన్స్ టార్గెట్ చేశారు.

IIT Baba : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని.. ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్ జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, బాబా చెప్పిన జోస్యం దారుణంగా ఫెయిల్ అయ్యింది. భారత్ కాదు.. పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. టీమిండియా ఘన విజయం సాధించింది.
Also Read : కోహ్లీ సెంచరీ.. పాక్ పై భారత్ ఘన విజయం..
భారత్ పాక్ మ్యాచ్ అయిపోగానే.. ఐఐటీ బాబాను క్రికెట్ లవర్స్, నెటిజన్స్ టార్గెట్ చేశారు. ఐఐటీ బాబాపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు నీ జోస్యం ఏమైంది? అంటూ బాబాను ఏకిపారేస్తున్నారు. వైరల్ అయ్యేందుకు సొంత దేశం ఓడిపోవాలని కోరుకోవడం ఏంటని బాబాపై నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు. అంతేకాదు.. ఎక్స్ లో #IITianBaba ట్రెండ్ చేస్తున్నారు.
భారత్ చేతిలో పాకి చిత్తు..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాక్ తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. పాకిస్తాన్ టోర్నీ నుంచి దాదాపుగా నిష్ర్కమించింది.
అసలు ఐఐటీ బాబా ఏమన్నారంటే..
భారత్ పాక్ హైఓల్టేజ్ మ్యాచ్ లో ఇండియా జట్టే విజయం సాధిస్తుందని అధికశాతం మంది మాజీ క్రికెట్లు అంచనా వేశారు. అయితే, ఇటీవల మహాకుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఐఐటీ బాబా మాత్రం షాకింగ్ ప్రిడిక్షిన్ చెప్పాడు. భారత్ పై పాకిస్తాన్ గెలుస్తుందని అన్నాడు.
‘‘నేను మొదటి నుంచి చెబుతున్నా.. ఈసారి టీమిండియాకు ఓటమి తప్పుదు. విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్లు ఎవరు ఎంతమంది ఆడినా టీమిండియాకు పరాజయం తప్పదు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మారదు. ఏం జరగాలని రాసుందో అది జరిగి తీరుతుంది. నేను గెలవదని చెప్పానంటే.. గెలవదు అంతే.. దేవుడు గొప్పా..? మీరు గొప్పా?’’ అంటూ ఐఐటీ బాబా జోస్యం చెప్పాడు.
ఎవరీ ఐఐటీ బాబా..
ఐఐటీ బాబాగా పాపులర్ అయిన వ్యక్తి పేరు అభయ్ సింగ్. మహాకుంభమేళా ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఐఐటీ బాంబే నుండి డిగ్రీ పొందిన ఏరోస్పేస్ ఇంజనీర్. కెనడాలో అధిక జీతంతో ఉద్యోగం చేశాడట. కానీ, తన కెరీర్ ను వదులుకొని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. మహాకుంభమేళా సందర్భంగా సన్యాసి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తనను తాను ఐఐటీ బాబాగా ప్రకటించుకున్నాడు. కుంభమేళాలో విశేష ప్రాచుర్యం పొందాడు.
సోషల్ మీడియాలో అతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ వర్సెస్ ఇండియా హైఓల్టేజ్ మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పి మరింత పాపులర్ అయ్యాడు. కట్ చేస్తే.. బాబా జోస్యం దారుణంగా ఫెయిల్ అయ్యింది. బాబా జోస్యం రివర్స్ అయ్యింది. భారత్ గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయింది. మరిప్పుడు దీనిపై ఐఐటీ బాబా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.