మీరే గెలిపించారా?.. ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నదీమ్‌పై పాక్ ప్రధాని వీడియో.. తీవ్ర విమర్శలు

ఎవరైనా సొంత టాలెంట్‌తో పైకి వచ్చి ఏదైనా సాధిస్తే వారు సాధించిన ఘనతను తమ ఖాతాలో వేసుకుంటారు రాజకీయ నాయకులు. తమ వల్లే గెలిచాడంటూ..

మీరే గెలిపించారా?.. ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నదీమ్‌పై పాక్ ప్రధాని వీడియో.. తీవ్ర విమర్శలు

Shehbaz Sharif: పాకిస్థాన్‌లో క్రీడలతో పాటు ప్రతి వ్యవస్థలోనూ బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయిందని పదే పదే విమర్శలు వస్తుంటాయి. నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్న వారికి తొక్కేస్తూ రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నవారు తమ బంధువులకు అవకాశాలు ఇప్పిస్తుంటారు. ఎవరైనా సొంత టాలెంట్‌తో పైకి వచ్చి ఏదైనా సాధిస్తే వారు సాధించిన ఘనతను తమ ఖాతాలో వేసుకుంటారు రాజకీయ నాయకులు.

దీంతో అంతర్జాతీయ క్రీడల్లో పాకిస్థాన్ వెనకబడిపోతుందని విమర్శలు ఉన్నాయి. అటువంటిది అన్నింటినీ దాటుకుని ఒలింపిక్స్ వరకు వెళ్లి స్వర్ణ పతకాన్ని సాధించాడు అథ్లెట్ నదీమ్. జావెలిన్‌ త్రో ఫైనల్లో పాకిస్థాన్ స్టార్‌ అథ్లెట్‌ నదీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.

వ్యక్తిగత క్రీడాంశంలో ఒలింపిక్స్‌ చరిత్రలో ఆ దేశానికి తొలి స్వర్ణ పతకం ఇదే. గురువారం అర్ధరాత్రి జావెలిన్‌ త్రో ఫైనల్‌ను పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లైవ్‌లో చూశారు. ఒలింపిక్స్‌లో దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని సాధించిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ వీడియో తీసుకున్నారు.

ఆ సమయంలో షెహబాజ్ షరీఫ్ పక్కన కూర్చున్న వ్యక్తి మాట్లాడుతూ.. ‘శుభాకాంక్షలు సర్.. పాకిస్థాన్ జిందాబాద్.. ఇదంతా మీ విజన్ వల్లే.. అతడికి మీరే అవకాశం ఇచ్చారు’ అని అన్నారు. నదీమ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ, తన వల్లే అతడు స్వర్ణం సాధించాడనేలా ప్రవర్తించిన షరీఫ్‌పై విమర్శలు వస్తున్నాయి. అసలు షరీఫ్ లైవ్ మ్యాచ్ చూడలేదని, హైలైట్స్ చూస్తూ ఈ వీడియో ఉద్దేశపూర్వకంగానే తీసుకుని పోస్ట్ చేయించారని కొందరు అంటున్నారు. క్రీడాంశాల్లో కూడా అవకాశావాద రాజకీయాలు చేస్తున్నారని కొందరు కామెంట్లు చేశారు.

Also Read : భారత్-పాక్‌ స్టార్లు.. మైదానంలో ప్ర‌త్య‌ర్థులు.. బయట దోస్తులు..