Pat Cummins : రెండోసారి తండ్రైన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్.. కూతురుకి ఏ పేరు పెట్టాడో తెలుసా?
ఆస్ట్రేలియా సారథి, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో సారి తండ్రి అయ్యాడు.

Pat Cummins Wife Becky Welcome Baby Girl Edi Share First Photo
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ప్రస్తుతం అమితానందంలో మునిగిపోయాడు. రెండో సారి అతడు తండ్రి అయ్యాడు. అతడి భార్య బెక్కీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాదండోయ్ తమ చిన్నారిని ఫోటోను పోస్ట్ చేశారు. చిన్నారికి ఎడి అనే పేరును పెట్టినట్లుగా వెల్లడించారు.
‘ఇదిగో తనే ఎడి. మా ముద్దుల కూతురు. ఎంతో సంతోషంగా ఉంది. వర్ణించడానికి మాటలు రావడం లేదు.’ అంటూ పాట్ కమిన్స్ రాసుకొచ్చాడు. కాగా.. పాట్ కమిన్స్ దంపతులకు ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అతని పేరు ఆల్బీ.
Suryakumar Yadav : సూర్య భాయ్ మళ్లీ ఫ్లాప్.. ఏముందిలే సర్దుకో ఇక..
View this post on Instagram
తన భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే సమయంలో పక్కనే ఉండాలని భావించిన కమిన్స్ శ్రీలంక పర్యటనకు వెళ్లలేదు. ప్రస్తుతం ఆసీస్ జట్టు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడుతోంది. కాగా.. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కమిన్స్ ఆడడం లేదు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా జట్టు వెల్లడించింది. అతడికి చీలమండల గాయం తిరగబెట్టినట్లు పేర్కొంది. అతడితో పాటు గాయంతో బాధపడుతున్న పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సైతం పాల్గొనడం లేదంది.
నలుగురు దూరం..
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కమిన్స్, హేజిల్ వుడ్ లు గాయాల కారణంగా దూరం అయ్యారు. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ అనూహ్యంగా వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. మిచెల్ మార్ష్ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించడానికి ముందే తప్పుకున్నాడు.
ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టును ప్రకటించగా.. మార్పులు చేర్పులకు ఫిబ్రవరి 12లోపు అవకాశం ఉంది. మరి వీరి స్థానాల్లో ఆసీస్ ఎవరిని జట్టులోకి తీసుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. పాట్ కమిన్స్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరుకుంది. గాయం తీవ్రత మరీ ఎక్కువ అయితే అతడు ఐపీఎల్ ఆడడం కష్టమే..