Suryakumar Yadav : సూర్య భాయ్ మళ్లీ ఫ్లాప్.. ఏముందిలే సర్దుకో ఇక..
ఇప్పట్లో టెస్టు జట్టులో సూర్యకుమార్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Suryakumar Yadav woes with bat continues in Ranji Trophy quarterfinal
పొట్టి ఫార్మాట్‌లో టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతటి ప్రమాదకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో షాట్లు ఆడుతూ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. టీ20ల్లో అతడికి తిరుగులేదు. అయితే.. వన్డేలు, టెస్టులకు వచ్చే సరికి మాత్రం ఓ సాధారణ ఆటగాడిగా మారిపోతున్నాడు. ఎన్నో అవకాశాలను దక్కించుకున్నా వన్డేల్లో నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. టెస్టుల్లో ఒకే ఒక మ్యాచ్‌లో అవకాశం రాగా అందులో విఫలం కావడంతో మరోమ్యాచ్ అవకాశాలు రాలేదు.
ఈ క్రమంలో రంజీలో ఆడి పరుగుల వరద పారించి టీమ్ఇండియా తరుపున మూడు ఫార్మాట్లలో ఆడడమే తన లక్ష్యం అని ఓ సందర్భంలో సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అయితే.. తాజాగా రంజీట్రోఫీలో బరిలోకి దిగిన అతడు ఘోరంగా విఫలం అయ్యాడు. ముంబైకు ప్రాతినిధ్యం వహించిన సూర్య.. హర్యానాతో ప్రారంభమైన మ్యాచ్‌లో కేవలం 9 పరుగులకే వెనుదిరిగాడు.
అలా వచ్చి.. ఇలా వెళ్లి..
రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్స్ శనివారం ఆరంభం అయ్యాయి. ఇందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై- హర్యానా మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. హర్యానా పేసర్ల ధాటికి రహానే సేన కష్టాల్లో పడింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే(0) డకౌట్ కాగా.. మరో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ ఆకాశ్ ఆనంద్ పది పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. వన్‌డౌన్‌లో సిద్ధేశ్ లాడ్(4) విఫలం కాగా.. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాడు.
రెండు ఫోర్లు కొట్టి మంచి ఊపులో కనిపించాడు. అయితే.. సుమిత్ కుమార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సూర్య ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 9 పరుగులు మాత్రమే సాధించాడు. ఆ తరువాత కాసేపటికే శివమ్ దూబె (28)విఫలం కావడంతో ముంబై 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
SAT20 : మార్‌క్రమ్ మామనా.. మజాకానా.. ఆనందంలో కావ్య పాప.. ముచ్చటగా మూడోసారి..
కాగా.. చివరిసారిగా అక్టోబర్ 2024లో రంజీట్రోఫీలో ఆడాడు సూర్య. అప్పుడు మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లోనూ ఏడు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఇప్పుడు విఫలం కావడంతో ఇక సూర్య టెస్టు జట్టులో చోటు గురించి మరిచిపోవాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా ఆకట్టుకున్నప్పటికి బ్యాటర్‌గా ఘోరంగా విఫలం అయ్యాడు. 5 మ్యాచుల్లో 5.60 సగటుతో 28 పరుగులే చేశాడు.