SRH vs RR : ఫైనల్‌కి దూసుకెళ్లిన హైదరాబాద్.. రాజస్తాన్‌పై ఘన విజయం

క్వాలిఫ‌య‌ర్ 2లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

SRH vs RR : ఫైనల్‌కి దూసుకెళ్లిన హైదరాబాద్.. రాజస్తాన్‌పై ఘన విజయం

PIC credit : IPL

కీలక మ్యాచ్‌లో చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు..
ఐపీఎల్ టోర్నీలో ఫైనల్ కి దూసుకెళ్లింది సన్ రైజర్స్ హైదరాబాద్. కీలక మ్యాచ్ లో హైదరాబాద్ దుమ్మురేపింది. డూ ఆర్ డై మ్యాచ్ లో బౌలర్లు చెలరేగిపోయారు. క్వాలిఫయర్ -2 లో రాజస్తాన్ రాయల్స్ పై ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ను.. హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. 139 రన్స్ కే పరిమితం చేశారు. దాంతో 36 పరుగుల తేడాతో ఎస్ఆర్ హెచ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. హైదరాబాద్ చేసింది స్వల్ప స్కోర్ అయినా.. బౌలర్లు విజృంభించారు. దీంతో రాజస్తాన్ వికెట్లు టపటపా పడ్డాయి. ఫలితంగా కమిన్స్ సేన ఐపీఎల్ ఫైనల్ కు దర్జాగా దూసుకెళ్లింది. ఈ నెల 26న చెన్నైలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ తలపడనుంది.

 

రాజ‌స్థాన్ టార్గెట్ 176
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 175 ప‌రుగులు చేసింది. హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. ట్రావిస్ హెడ్ (34), రాహుల్ త్రిపాఠి (37)లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌, అవేశ్ ఖాన్ లు చెరో మూడు వికెట్లు తీశారు. సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

క్లాసెన్ హాఫ్ సెంచ‌రీ..
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి క్లాసెన్ 33 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన అవేశ్‌..
అవేశ్ ఖాన్ వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. 14 ఓవ‌ర్ వేసిన అత‌డు ఐదో బంతికి నితీశ్ రెడ్డి (5), ఆరో బంతికి అబ్దుల్ సమద్ (0) లను ఔట్ చేశాడు. 14వ ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 120/6. క్లాసెన్ (29) క్రీజులో ఉన్నాడు.

ట్రావిస్ హెడ్ ఔట్‌.. 
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రో వికెట్ కోల్పోయింది. సందీప్ శ‌ర్మ బౌలింగ్‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ క్యాచ్ అందుకోవ‌డంతో ట్రావిస్ హెడ్ (34; 28 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ఔట్ అయ్యాడు. 10 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 99/4. క్లాసెన్ (14), నితీశ్ రెడ్డి (0)లు క్రీజులో ఉన్నారు.

ఒకే ఓవ‌ర్‌లో త్రిపాఠి, మార్‌క్ర‌మ్ ఔట్‌..
స‌న్‌రైజ‌ర్స్ ట్రెంట్ బౌల్ట్ గ‌ట్టి షాకిచ్చాడు. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. దూకుడుగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి (37; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స‌ర్లు)తో పాటు మార్‌క్ర‌మ్ (1)ల‌ను పెవిలియ‌న్‌కు చేర్చాడు. 5 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 57/3. హెడ్ (7) క్రీజులో ఉన్నాడు.

16 ప‌రుగులు..
అశ్విన్ వేసిన నాలుగో ఓవ‌ర్‌లో రాహుల్ త్రిపాఠి దంచికొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 4,4,6 బాదడంతో ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయ‌. 4 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 45/1. త్రిపాఠి (26), హెడ్ (6) క్రీజులో ఉన్నారు.

అభిషేక్ శ‌ర్ ఔట్‌..
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మొద‌టి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. రెండు, మూడు బంతుల‌ను వ‌రుసగా సిక్స్‌, ఫోర్‌గా మ‌లిచి ఊపుమీద క‌నిపించిన అభిషేక్ శ‌ర్మ (12; 5 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) తొలి ఓవ‌ర్‌లోని చివ‌రి బంతికి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో టామ్ కోహ్లర్-కాడ్మోర్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ 13 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్

రాజస్థాన్ రాయల్స్..
యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్‌), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

క్వాలిఫ‌య‌ర్ 2లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకోనుంది. అక్క‌డ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. కాగా.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాజ‌స్థాన్ టాస్ గెలిచింది. ఆర్ఆర్‌ కెప్టెన్ సంజూ శాంస‌న్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.